
హైటెక్ ప్రకటనలతో చంద్రబాబు దగా
రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తానంటూ హైటెక్ ప్రకటనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
టెక్కలి (కోటబొమ్మాళి) :రాష్ట్రాన్ని మరో సింగపూర్ చేస్తానంటూ హైటెక్ ప్రకటనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలను దగా చేసున్నారని, మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆది వారం ఆయన మండలంలోని మృతుల కుటుంబాలను పరామర్శించారు. కోటబొమ్మాళిలో ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త బోయిన రమణమూర్తి, కిష్టుపురం గ్రామంలో పార్టీకి చెందిన బొడ్డు అప్పారావు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబాలతో పాటు గంగరాం సర్పంచ్ భర్త వైఎస్సార్ సీపీ నాయకుడు పేడాడ వెంకట్రావు కాలికి గాయం కావడంతో ఆయనను పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతాంగం పరిస్థితి పూర్తి అధ్వానంగా మారిందన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తానన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధరను కల్పించకపోవడం దారుణమన్నారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, ఇండస్ట్రీయల్ కారిడార్‌లు, జలరవాణాలను అభివృద్ది చేస్తానంటూ ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నట్టు ఆరోపించారు. ప్రభుత్వం రైతాంగానికి చేస్తోన్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 20, 21 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
మంత్రి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారు
టెక్కలి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై మంత్రి అచ్చెన్నాయుడు కక్ష పూరిత చర్యలకు పాల్పడుతున్నారని ధర్మాన ఆరోపించారు. పేద ప్రజలు, సామాన్యులపై కక్ష సాధించడానికి కేటాయిస్తోన్న సమయాన్ని అభివృద్ధికి కేటాయించాలని ధర్మాన ఎద్దేవా చేశారు. మంత్రి కక్ష సాధింపు చర్యలకు సహాయ పడుతోన్న అధికారులు చట్టాలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన సమయం వస్తుందన్నారు. ఆయనతో పాటు డీసీఎంఎస్ చైర్మన్ జి.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ దుబ్బ వెంకట్రావు, పార్టీ నాయకులు పేరాడ తిలక్, వై.చక్రవర్తి, అన్నెపు రామారావు, బగాది నర్సింగరావు, చింతాడ గణపతి, సత్తారు సత్యం, కెల్లి చిన్నబాబు, తాతబాబు, కె.గణపతి, ఎం.గోపాలకృష్ణ, బి.మధు, బోయిన నాగేశ్వరరావు, వై.మన్మథరావు, జ్యోత్స్న, బి.వెంకట్రావు, కె.సంజీవి, కె.రామరాజు, ఆర్.మల్లేశ్వరరావు, ఎం.వీరాస్వామి, గారయ్యతో పాటు మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.