బుడగుట్లపాలెంలో కానరాని జెట్టీ
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): అదే పాట..ప్రతీ చోట అన్న చందంగా ఉంది టీడీపీ నాయకుల తీరు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నేటి వరకు ఒక్కటీ అమలు చేయలేదు. నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యలపై ఐదేళ్లయినా కనీసం పట్టించుకోలేదు. ఇపుడు ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం ప్రచార బాట పట్టారు. అపరిష్కృతంగా ఉన్న పాత సమస్యలను తెరపైకి తెచ్చి పరిష్కరిస్తానని హామీలు గుప్పిస్తున్నారు. ఇందుకు చిలకపాలెంలోని జరిగిన సీఎం సభ ఉదాహరణగా చెప్పవచ్చు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, వెంకట్రావు ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలాయని, ఐదేళ్లు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, ఇప్పుడు ఏమి చేస్తారని నియోజకవర్గ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
నీటి మూటలుగానే మిగిలిన బాబు, కళా హామీలు
♦ ఎచ్చెర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు.
♦ లావేరు మండలం బుడుమూరు నారాయణసాగరం చెరువును మినీ రిజర్వాయర్‌గా తీర్చి దిద్ది 2500 ఎకరాలకు సాగునీరు అందించటం.
♦ ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం సముద్ర తీరంలో జెట్టీల నిర్మాణం.
♦ జీరుపాలెంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు.
♦ పైడిభీమవరంలో బీ–ఫార్మసీ కళాశాల ఏర్పాటు.
♦ పైడిభీమవరంలో ఈఎస్‌ఐ (వంద పడకల ఆస్పత్రి)
♦ పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ చర్యలు
ప్రచారాల్లో మరలా మాయమాటలు
గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, కళా వెంకట్రావు నియోజకవర్గంలోని అభివృద్ధి కోసం ఇచ్చిన ఆయా హామీల్లో ఒక్కటి కూడా నేటి వరకు అమలుచేయకపోవడం విశేషం. ఎన్నికల ప్రచారాల్లో మరోసారి ఆయా సమస్యలనే హైలైట్ చేసి ఈ దఫా పరిష్కరిస్తామని మాయ హామీలు గుప్పిస్తున్నారని ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు చెబుతున్నారు.
టీడీపీకి ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన ప్రజాసంక్షేమం
టీడీపీ నాయకులకు ఎన్నికల మందు ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుంది. 2014లో నియోజకవర్గంలో పలు సమస్యలపై ఇచ్చిన హామీలు వారికి ప్రస్తుతం గుర్తుకు లేవు. నియోజకవర్గ అభివృద్ధిని అటకెక్కించిన నాయకులు ఓట్లు పొందేందుకు మరలా తప్పుడు హామీలు గుప్పిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గుణపాఠం చెప్పడం ఖాయం.
– పి.రవి, కుశాలపురం
Comments
Please login to add a commentAdd a comment