నంద్యాలలో న్యాయం గెలిచింది: శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల : నంద్యాలలో న్యాయం గెలిచిందని వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ విష ప్రచారం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా టీడీపీ ఎన్ని అభ్యంతరాలు, కుట్రలు చేసినప్పటికీ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రలను ప్రోత్సహిస్తున్నారు. బూత్‌ల వారీగా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్‌ఆర్ సీపీదే విజయం...
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదంపై వైఎస్‌ఆర్ సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...‘నంద్యాలలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా టీడీపీ కుట్రలు పన్నిందని, ఎన్నికల నిబంధనల మేరకే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నంద్యాలలో వైఎస్‌ఆర్ సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సిగ్గుంటే 21మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
టీడీపీ పతనం ప్రారంభం..
ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ... ‘ ఇవాళ్టి నుంచే నంద్యాలలో టీడీపీ పతనం ప్రారంభం. రిటర్నింగ్ అధికారి నిర్ణయం టీడీపీకి చెంపపెట్టు. అభ్యంతరాల పేరుతో టీడీపీ విష ప్రచారం చేసింది. ఓటమి భయంతోనే కుట్రలు, కుతంత్రాలు పన్నారు. చిన్న విషయాన్ని ఎల్లో మీడియా చిలువలు పలువలు చేసింది. నామినేషన్ ఆమోదం కష్టమేనంటూ టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు.
నామినేషన్ల సమయంలోనే టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. విష ప్రచారంతో నామినేషన్ చెల్లకుండా చేయాలని చూశారు. చివరకు న్యాయమే గెలిచింది. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. నంద్యాలలో ఎంతకైనా దిగజారేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు ఆటలను సాగనివ్వం. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డికి ఎదురే లేదు. .’ అని అన్నారు.