పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారు: చంద్రబాబు
విశాఖపట్నం : బాధితులను ఆదుకోవడంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హుదూద్ తుపాను బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం ఇచ్చిన పవన్ కల్యాణ్ను బాబు ఈ సందర్భంగా అభినందించారు. గురువారం విశాఖపట్నంలో పవన్ కల్యాణ్తో కలసి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. తుపాన్ బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. హుదూద్ తుపానుకు ఆర్థిక సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నాని తెలిపారు. టాటా గ్రూప్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు సాయం అందించడానికి ముందుకు రావడం పట్ల బాబు హర్షం వ్యక్తం చేశారు.
బంగాళదుంపల కోసం బెంగాల్ సీఎంతో మూడుసార్లు మాట్లాడినట్లు చంద్రబాబు వివరించారు. నేటి నుంచి తుపాను సహాయ కార్యక్రమాలు అన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ ప్రజలలో ఆత్మస్థైర్యం కలిగించామన్నారు. అవసరమైతే ఫైరింజన్ల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామన్నారు. సహాయక చర్యలో పాల్గొనని... పని చేయని వారేవరినీ ఊరుకోనని ఉన్నతాధికారులను హెచ్చరించారు. విశాఖపట్నంలో గురువారం పరిస్థితి చక్కబడిందని చంద్రబాబు అన్నారు.