కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు
సాక్షి, పోలవరం : ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వేసిన ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కరి అయ్యారు. బుధవారం ప్రాజెక్టు పనులను గడ్కరీ పరిశీలించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కలసి మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు దేశానికి తలమానికమైనదని అన్నారు. అయితే, ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమని చెప్పారు. వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పారు. హఠాత్తుగా నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో చెప్పాలని సీఎం చంద్రబాబును గడ్కరీ అధికారుల సమక్షంలోనే నిలదీశారు. నవ్వుతూ మాట్లాడుతూనే ప్రాజెక్టు అంచనా వ్యయాలను అంతకంతకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు.
ప్రాజెక్టుపై పాత డీపీఆర్‌కు ప్రస్తుత డీపీఆర్‌కు అసలు పోలికే లేదని, ఎందుకు మార్చారో కచ్చితంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు. భూ సేకరణను గతంలో కంటే ఎక్కువగా చేశారని, పెరిగితే నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం పెరగాలి కానీ భూ సేకరణ ఎందుకని ప్రశ్నించారు. గడ్కరీ ప్రశ్నలపై చంద్రబాబు వివరణ ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఢిల్లీకి వచ్చి అక్కడే మూడు రోజులు పాటు ఉండాలని గడ్కరీ చంద్రబాబుకు సూచించారు.
జల వనరుల శాఖకు ప్రాజెక్టుపై అవసరమైన వివరాలన్నీ సమర్పించాలని చెప్పారు. ఆ తర్వాత ఎనిమిది రోజుల్లో అన్ని క్లియరెన్సులు ఇచ్చి నిధుల పెంపు కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపుతానని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఎంత ఖర్చైనా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. నిధుల గురించి బెంగపడాల్సిన పని లేదని అన్నారు. అభివృద్ధి, రాజకీయం రెండు వేర్వేరని వ్యాఖ్యానించారు. రాజకీయంగా తేడాలుంటే వీధుల్లో పోరాడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంత మేలు జరుగుతుందో నాకు బాగా తెలుసని అన్నారు. అందుకే ప్రాజెక్టు నిర్మాణానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
సవరించిన అంచనాలు రూ. 57, 940 కోట్లు..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ. 57, 940 కోట్లని పేర్కొన్నారు. ఇందులో భూ సేకరణ నిమిత్తం రూ. 33 వేల ఖర్చు అవుతుందని చెప్పారు. 2019 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment