సాక్షి, పశ్చిమగోదావరి : ఇచ్చిన మాట ప్రకారం 2020 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు స్పిల్, కాపర్ డ్యాం పనులు పూర్తి చేస్తామని నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం పోలవరంలో పర్యటించిన మంత్రి కాపర్ డ్యామ్‌ను పరిశీలించారు. స్థానికంగా జరుగుతున్ననిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే నెరవేరుస్తారని.. ఆయన మాట ప్రకారం నవంబర్ ఒకటి నుంచి పోలవరం పనులు ప్రారంభించామని తెలిపారు. డిసెంబరు ఒకటి నుంచి పనులను మరింత వేగవంతం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు కచ్చితంగా కట్టి తీరుతామని, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా స్పిల్ వే ద్వారా నీరు అందిస్తామని స్పష్టం చేశారు. కాపర్ డ్యాం ముందు నిర్మించడం వల్ల ఏజెన్సీ ప్రాంతాలు మునిగిపోయాయని, 18000 కుటుంబాలను మే నెలలోపు తరలిస్తామన్నారు.
అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్ల రుపాయల ప్రజాధనం కాపాడామని మంత్రి గుర్తు చేశారు. రూ.55,000 వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ రూ.17000 వేల కోట్ల పని మాత్రమే జరిగిందని వెల్లడించారు. కేవలం 30 శాతం మాత్రమే పనులు పూర్తయితే చంద్రబాబు నాయడు 75 శాతం పూర్తి చేశామని అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. 2018 నాటికే పోలవరం పూర్తి చేస్తామని టీడీపీ నాయకులు చెప్పారని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అబద్దాలు చెప్పి 23 స్థాానాలకు వచ్చారని, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు ఊరుకొరని హెచ్చరించారు. గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాయని మంత్రి దుయ్యబట్టారు.
వంకర బుద్ధి మార్చుకోవాలి
టీడీపీ నాయకులు తమపై బుద్దివంకరగా మాట్లాడుతున్నారని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. దేవినేని ఉమా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, తమ వంకర బుద్ది మార్చుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబుకు భయం పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయన మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు ఇష్టమైన సింగపూర్ వెళ్లి చికిత్స చెయించుకోవాలని హితవు పలికారు. ఆర్‌ఆర్ బాధితుల కోసం ఒక ఐపీఎస్ అధికారిని నియమించడం చూస్తుంటే వైఎస్ జగన్‌కు గిరిజనుల పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment