బాబు ప్రమాణ స్వీకారంగుంటూరులోనే..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 8న గుంటూరు- విజయవాడల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆచార్య నాగార్జున యూనివర్సీటీ వద్ద క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని వారంలో మూడు రోజుల పాటు ఇక్కడి నుంచే పాలన సాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు గోపీనాథ్, సత్యనారాయణలు సోమవారం ఏఎన్‌యూ ఎదురుగా స్థలాలు పరిశీలించడం, వర్సిటీలో భవనాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. 2009 ఎన్నికలకు ముందు ఇదే స్థలంలో తెలుగుదేశం పార్టీ యువగర్జన నిర్వహించిన వర్సీటీ ఎదుట ఉన్న ఖాళీస్థలంలో ప్రమాణ స్వీకార వేదిక నిర్మించాలని నిర్ణయించినట్లు పార్టీ శ్రేణుల నుంచి వినవస్తోంది. ఏర్పాట్లలో భాగంగా ఐజీ, ఎస్పీలు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా పోలీసు అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు.
సీఎం హెలీప్యాడ్, వసతికి ఏర్పాట్లు..
పోలీసు ఉన్నతాధికారులు వర్సిటీలోని క్రీడాప్రాంగణంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసేందుకు క్రీడామైదానం, పరిసరాలను పరిశీలించారు. చంద్రబాబు విశ్రాంతి తీసుకొనేందుకు అవసరమైన వసతి గృహాలను ఏర్పాటు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా ఆదివారం విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు ఏఎన్‌యూను సందర్శించి ఒకవేళ ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పడితే విద్యుత్ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుచేయాలి, ప్రత్యేక సబ్‌స్టేషన్ ఎక్కడ నిర్మించాలనే దానిపై ఉన్నతాధికారులు సూచనలు చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాలు గమనిస్తున్న ప్రజలు ఇక విజయవాడ- గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పడుతుందని బలంగా నమ్ముతున్నారు.
పార్టీ శ్రేణులను తరలించే ఏర్పాట్లు..
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని జిల్లా టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సభా వేదిక ఏర్పాటు విషయంపై పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలించాలని నిర్ణయించారు.