పవన్ కోసం చంద్రబాబు యత్నం!
టీడీపీకి మద్దతివ్వాలంటూ కోటరీ నేతలతో రాయబారాలు
పవన్ నుంచి స్పందన లేకపోవటంతో పలు ప్రతిపాదనలు
కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరాలనీ పవన్‌కల్యాణ్‌కు పిలుపులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రి చిరంజీవితో తలెత్తిన విభేదాలను బూచిగా చూపిస్తూ ఆయన సోదరుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను రాజకీయాల్లోకి లాగడానికి తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయనను రాజకీయాల్లోకి రప్పించడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన సన్నిహితులైన ఇద్దరు వ్యాపార వేత్తలకు బాధ్యత అప్పగించగా.. వారు నాలుగు రోజులుగా పవన్‌పై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. టీడీపీ నేతల నుంచి వచ్చిన ఏ ప్రతిపాదనపైనా పవన్‌కల్యాణ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని టీడీపీలోని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. దీంతో.. టీడీపీ నేతలైన ఆ వ్యాపారవేత్తలు రకరకాల ప్రత్యామ్నాయాలను కూడా ఆయన ముందుపెడుతున్నట్లు తెలిసింది. అవేమిటంటే ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న తరుణంలో పవన్‌కళ్యాణ్ కొత్తగా పార్టీ పెట్టడానికి అవకాశాలు లేవు.. ఆయన టీడీపీకి మద్దతివ్వాలి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 25 అసెంబ్లీ స్థానాల్లో పవన్ కల్యాణ్ స్వతంత్ర అభ్యర్థులను నిలిపితే టీడీపీ వారికి మద్దతునిస్తుంది. అలాగే ఏదైనా లోక్‌సభ స్థానం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేస్తే ఆ స్థానంలో కూడా టీడీపీ అభ్యర్థిని పెట్టబోదు. అయితే పవన్ తాము చెప్పిన పలు నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున ప్రచారం చేయాలి. టీడీపీలోకి రాకపోయినా పవన్ బీజేపీలో చేరాలి. బీజేపీ తరఫున కాకినాడ లేదా మరేదైనా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలి. ఈ విషయంలో బీజేపీ నేతలను ఒప్పిస్తాం.
పవన్ కోసం ప్రయత్నిస్తే తప్పేమిటి?
టీడీపీ నేతలు ఒంటి చేత్తో చప్పట్లు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే పవన్‌కల్యాణ్ స్పందించడం లేదని గతంలో పీఆర్పీ అనుబంధ విభాగంగా పనిచేసిన యువరాజ్యంలో కీలక పాత్ర పోషించిన ఒక నేత చెప్పారు. అయితే.. చిరంజీవి పీఆర్పీ పెట్టినప్పుడు టీడీపీ నుంచి కొందరిని చేర్పించుకుని తమను దెబ్బతీశారని.. ఇప్పుడు తమకు అవకాశం ఉన్నప్పుడు పవన్‌కల్యాణ్ కోసం ప్రయత్నం చేయడంలో తప్పేమిటని టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు సి.ఎం.రమేష్, కంభంపాటి రామ్మోహన్‌రావులు గత కొద్దిరోజులుగా పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్న విషయం తెలుసనీ, అయితే ఎంతవరకు వచ్చిందో తనకు సమాచారం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో నేత ఒకరు పేర్కొన్నారు.
‘కిరణ్ పార్టీ’ నుంచీ మంతనాలు: మరోవైపు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున కూడా ఆయనపై ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలు కొద్ది రోజులుగా పవన్‌తో పలు దఫాలుగా సమావేశమయ్యారని.. కిరణ్ ఏర్పాటు చేసే పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్తున్నారు. ఇంకోవైపు లోక్‌సత్తా కూడా పవన్ మద్దతు కోరింది. అయితే.. గత ఎన్నికలకు ముందు తన సోదరుడు చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, అధికార కాంగ్రెస్‌పై యుద్ధం ప్రకటించి.. ఎన్నికల తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేయటం జనం ఇంకా మరువలేదని.. ఇప్పుడు తాను రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఎంతవరకూ నమ్ముతారనే సందేహంలో పవన్ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇదిలావుంటే.. ఏ కుటుంబంలోనైనా విభేదాలు ఉండటం సహజమని.. అలాంటిది పవన్ కుటుంబంలో ఉన్న విభేదాలను భూతద్ధంలో చూపించి చీలికలు తెచ్చి రాజకీయ లబ్ధిపొందాలని చేస్తున్న ప్రయత్నాలపై పవన్ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.