ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారే ప్రజానాయకులవుతారు. ఈ విషయాన్ని విస్మరించి.. తెలుగు ప్రజల్ని వంచించి..
వైఎస్సార్ సీపీ నేత ఆర్కే బహిరంగ లేఖ
Published Fri, Sep 6 2013 4:37 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
సాక్షి, గుంటూరు : ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారే ప్రజానాయకులవుతారు. ఈ విషయాన్ని విస్మరించి.. తెలుగు ప్రజల్ని వంచించి.. సోనియా విశ్వాసం, దిగ్విజయ్ సింగ్, చిదంబరం ప్రాపకం పొందడం కోసం చంద్రబాబు పాకులాడడం తగదని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్కే గురువారం ఓ బహిరంగలేఖ రాశారు.
తనకు అధికారం ఇస్తే ఏడాదిలోపు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పదే పదే వేడుకుంటున్న చంద్రబాబుకు 2004, 2009లో రెండు దఫాలు ప్రజలు తిరస్కరించినా వారి మనోభావాలు పట్టించుకోకుండా ఆత్మవంచన యాత్ర చేయడం ఇంకా ఎందుకోసమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం సుస్పష్టమని, టీడీపీ విధానమేంటో చంద్రబాబు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్కే బహిరంగ లేఖలోని ప్రశ్నలివే...
= బాబు గారూ... 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకుని పోటీ చేసి టీడీపీ తెలంగాణకు అనుకూలమని మీరు ప్రకటించిన విషయం వాస్తవమా? అవాస్తమా?
= తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 2008లో బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ప్రణబ్‌ముఖర్జీకి లేఖ ఇచ్చి ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రం విభజిస్తే సీమాంధ్ర పరిస్థితి ఏంటి? అన్న విషయంపై ఒక్క ముక్కయినా రాశారా?
= విభజన ప్రకటన వెలువడిన తర్వాత నీటి సమస్య, హైదరాబాద్ మహానగరం అంశాలపై పరిష్కారం కోసం ప్రశ్నించకుండా సీమాంధ్రుల మనోభావాల్ని రూ.4-5 లక్షల కోట్లకు తాకట్టు పెట్టే విధంగా ప్యాకేజీ అడిగిన విషయం మరిచి తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర అంటూ తెలుగుజాతి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారా? లేదా?
= రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న మీ వద్దకు ఏపీఎన్జీవోలు వచ్చి బ్లాంక్ చెక్‌లా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోమని ప్రాధేయపడినా వారి పట్ల మీరు వ్యవహరించి తీరు.. వారితో ఏం మాట్లాడారో.. మీకు గుర్తుందా?
= విభజన ప్రకటనపై కాంగ్రెస్ ఎక్కడ వెనక్కు వెళుతుందోనని గతంలో రెండు కళ్ల సిద్ధాంతం అన్నట్లు ఇప్పుడు రెండు కాళ్ల సిద్ధాంతం కోసం మీరు యాత్ర చేయడం లేదని మనస్సాక్షితో చెప్పగలరా?
= విభజన జరిగితే మీరు ప్రాతినిధ్యం వహించే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పు నీరు తప్ప మంచినీరు దొరకదనే విషయం మీకు తెలియదా? ఈ విషయాన్ని మీ యాత్రలో ధైర్యంగా చెప్పగలరా?
= రాష్ట్ర విభజనపై ప్రకటన చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ఆగదని చెబుతున్న దిగ్విజయ్‌సింగ్.. మీకు మంచి స్నేహితుడనే విషయం ఆయన స్వయంగా మీడియాలో అంగీకరించారు. ఈ విషయంపై బహిరంగంగా బస్సు యాత్రలో మీరు ప్రకటన చేయగలరా?
= మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేయకుండా రాజకీయ వ్యాఖ్యలతో, ఆరోపణలతో కూడిన లేఖలను రాజీనామా చేశారా? లేదా?
ఈప్రశ్నలపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని మీరు యాత్ర సాగించాలని, ముఖ్యంగా చంద్రబాబు ఫ్రస్టేషన్ నుంచి బయటపడాలని ఆర్కే తన లేఖ ద్వారా సూచించారు.
Advertisement
Advertisement