చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం | Chandrababu Negligence Is Giving Loss to Drinking and irrigation projects | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిర్లక్ష్యం.. నీటి నిల్వకు శాపం

Published Mon, Nov 11 2019 4:03 AM | Last Updated on Mon, Nov 11 2019 4:36 AM

Chandrababu Negligence Is Giving Loss to Drinking and irrigation projects - Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి దిగువకు విడుదలవుతున్న కృష్ణా జలాలు (ఫైల్‌)

సాక్షి, అమరావతి: ప్రాజెక్టులకు సంబంధించిన ప్రధాన కాలువలను విస్తరించడంలో, పెండింగ్‌ పనులను పూర్తి చేయడంలో గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో నేడు వరద నీటిని ఒడిసి పట్టలేని దుస్థితి నెలకొంది. తాగు, సాగునీటి ప్రాజెక్టుల గురించి అప్పడే కాస్త శ్రద్ధ చూపి ఉంటే ఇప్పుడు తరలిస్తున్న నీటికి రెట్టింపు తరలించి నిల్వ చేయడానికి వీలుండేది. 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. కనీసం కాలువల విస్తరణలో మిగిలిపోయిన చిన్న చిన్న పనులను సైతం పూర్తి చేయక పోవడం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. అరకొరగా మిగిలి ఉన్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో సైతం విఫలమవడం వల్లే వరద నీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునే అవకాశం లేకుండా పోయిం దని సాగు నీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.  

అన్ని కాలువలపై శీతకన్ను 
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఒడిసి పట్టి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఇందులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని అప్పట్లోనే 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. గత ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు దీనిని 80 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే శ్రీశైలానికి వరద వచ్చినప్పుడు రోజూ 7.5 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. తద్వారా కృష్ణా వరద నీటిని ఒడిసి పట్టి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలో అంతర్భాగమైన వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, చిత్రావతి తదితర జలాశయాలను కేవలం 40 రోజుల్లోనే నింపి ఉండవచ్చు. బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ, ఎస్సార్బీసీ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని కనీసం 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే నేడు తక్కువ రోజుల్లోనే అనుకున్న మేరకు నీటిని తరలించడానికి వీలయ్యేది. వెలిగోడు రిజర్వాయర్‌కు జలాలను తరలించే కాలువకు కనీసం లైనింగ్‌ చేయించిన పాపాన పోలేదు. గాలేరు–నగరి కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉండింటే గోరకల్లు, అవుకు జలాశయాలను యుద్ధ ప్రాతిపదికన నింపి ఉండవచ్చు. బ్రహ్మంసాగర్‌కు నీటిని సరఫరా చేసే కాలువ, నిప్పులవాగు సామర్థ్యాన్ని పెంచే పనులను సైతం చేపట్టక పోవడం వల్ల ఇవాళ ఎంతగా నష్టపోయామో కళ్లెదుటే కనిపిస్తోంది.  
 
ముందు చూపు కరువు 

అవుకు రిజర్వాయర్‌ నుంచి గాలేరు–నగరి వరద కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే గండికోట జలాశయాన్ని 10 రోజుల్లో నింపి ఉండవచ్చు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాలెం, మైలవరం రిజర్వాయర్లను యుద్ధ ప్రాతిపదికన నింపి ఉండటానికి వీలుండేది. గాలేరు–నగరి కాలువ సామర్థ్యాన్ని పెంచి ఉంటే ఆ ప్రాజెక్టు రెండో దశలో వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో నిర్మిస్తున్న వేణుగోపాలసాగర్, అడవికొత్తూరు, శ్రీనివాససాగర్, పద్మసాగర్‌ తదితర జలాశయాలను త్వరితగతిన నింపడానికి ఉపకరించేది. నిప్పులవాగు పరిస్థితీ అంతే. దీని ప్రవాహ సామర్థ్యాన్ని 30–35 వేల క్యూసెక్కులకు పెంచి ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా వచ్చే నీటిని వేగంగా తరలించడానికి అవకాశం ఉండేది. సోమశిల రిజర్వాయర్‌ నుంచి కండలేరు రిజర్వాయర్‌కు ప్రస్తుతం రోజుకు 0.8 టీఎంసీలకు మించి నీటిని తరలించలేని పరిస్థితి. ఆ కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వి ఉంటే ఈ పాటికి కండలేరు నిండుగా నీటితో కళకళలాడుతుండేది. వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిన పనులను చంద్రబాబు పూర్తి చేసి ఉంటే 53 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉండేది.  
 
హంద్రీ–నీవా పరిస్థితీ అంతే.. 
శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున 40 టీఎంసీలను తరలించడం ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు.. 30 లక్షల మందికి తాగు నీరు అందించడమే లక్ష్యంగా దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. గత ఐదేళ్లలో ఈ కాలువను చంద్రబాబు 10–12 వేల క్యూసెక్కులకు విస్తరించి ఉంటే నేడు కృష్ణా వరద జలాలను మరింతగా ఒడిసి పట్టడానికి వీలుండేది. తద్వారా దీనిపై ఆధారపడ్డ కృష్ణగిరి, పందికోన, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల ప్రాజెక్టులను త్వరితగతిన నింపడంతో పాటు దాదాపు 1000 చెరువులను నింపి ఉండవచ్చు. మొత్తంగా కాలువలను విస్తరించడంపై చంద్రబాబు దృష్టి సారించి ఉంటే ఇప్పుడు కనీసం 200 – 250 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసి ఉండవచ్చని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ నుంచి 793.145 టీఎంసీలు సముద్రంలో కలిసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జూలై 31 నుంచి ఇప్పటి వరకు శ్రీశైలానికి ఎనిమిది దఫాలుగా వరద వచ్చినా సరైన రీతిలో ఆ నీటిని ఉపయోగించుకోలేక పోయామంటే గత సర్కారు నిర్లక్ష్యమేనని చెబుతున్నారు. ఈ ఏడాది మే 30న అధికారం చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కాలువల పరిస్థితులు సక్రమంగా లేకపోయినా సరే.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా వరద జలాలను తరలించి ఒక వైపు తెలుగుగంగ, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీళ్లందిస్తూనే.. వెలిగోడులో 16.42 టీఎంసీలు, గోరకల్లులో 8, అవుకులో 3.13, గండికోటలో 11.96, చిత్రావతిలో 6.48, మైలవరంలో 6.18, బ్రహ్మంసాగర్‌లో 5.01, సోమశిలలో 72.95, కండలేరులో 42.06 టీఎంసీలను నిల్వ చేయగలిగారు. సీఎం వైఎస్‌ జగన్‌ తెలంగాణ సర్కార్‌తో చర్చించి.. పునరావాసం సమస్యను పరిష్కరించడం వల్ల పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేయగలిగారు.  

కనీసం 650 టీఎంసీలను ఉపయోగించుకోలేకపోయాం 
పోలవరం పూర్తయి ఉంటే 196 టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉండేది. 301 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా 25 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 7.2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి అదనంగా 80 టీఎంసీలు సరఫరా చేయడం ద్వారా కొత్తగా ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయి ఉంటే 53 టీఎంసీలను మళ్లించడం ద్వారా 4.32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉండేది. ఈ సీజన్‌లో ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 3,727.918 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయి.

పోలవరం, చింతలపూడి, తాడిపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి పథకాలను చంద్రబాబు పూర్తి చేసి ఉంటే.. సముద్రంలో కలిసిన జలాల్లో కనీసం 650 టీఎంసీలకుపైగా వినియోగించుకునే అవకాశం ఉండేది. బంజరు భూములు సస్యశ్యామలయ్యేవి. వంశధార స్టేజ్‌–2లోని ఫేజ్‌–2లో మిగిలిపోయిన పనులను ఐదేళ్లలో పూర్తి చేయడంలో చంద్రబాబు విఫలయ్యారు. దీంతో హీరమండలం రిజర్వాయర్‌లో 20 టీఎంసీలకు గాను కేవలం 5.61 టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గొట్టా బ్యారేజీ నుంచి వంశధార జలాలు 119.89 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. పెండింగ్‌ పనులు పూర్తి చేసి ఉంటే.. సముద్రంలో కలిసిన వంశధార జలాల్లో కనీసం 25 నుంచి 30 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండేది. ఈ సీజన్‌లో ఏకంగా 4,640.953 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement