
సాక్షి, అమరావతి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయవద్దని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చర్చకు పెట్టిన మూడు రాజధానులు, ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డుల బిల్లుపై చర్చలో గంటన్నరసేపు మాట్లాడిన టీడీపీ అధినేత అమరావతిని సమర్థించుకునేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. డబ్బుల్లేవనే నెపంతో అమరావతి నిర్మాణాన్ని నిలుపుదల చేయవద్దని, అది స్వయం ఆర్థిక ప్రాజెక్టు అని, దాన్ని పూర్తిచేస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమానికి డబ్బులు వస్తాయని, అమరావతి కల్పతరువు, కామధేనువుగా ఉంటుందన్నారు. తాను చేపట్టిన ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కొనసాగించారని, దీంతో వైఎస్సార్‌తోపాటు తనకు పేరొచ్చిందని చెప్పారు. వైఎస్సార్ తనయుడుగా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని జగన్ అమరావతిని పూర్తి చేయాలని, చిన్నవాడైనా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. అమరావతిలో అన్ని అవసరాలకు పోనూ 10వేల ఎకరాలు మిగులుతుందని, ఆ భూముల్ని విక్రయించి అన్ని నిర్మాణాలూ చేయవచ్చన్నారు.
రియల్ ఎస్టేట్ వల్లే భూముల ధరలు పెరుగుతాయి..
మూడు రాజధానులు ఎక్కడా విజయవంతం కాలేదని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రియల్ ఎస్టేట్ వల్లే భూముల ధరలు పెరుగుతాయని, తద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. అమరావతి బాండ్లకు వెళితే రూ.2 వేల కోట్లు వచ్చాయన్నారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, విశాఖలో రాజధాని పెట్టడంవల్ల రాయలసీమ జిల్లాలకు దూరమవుతుందని, ఆ జిల్లాల ప్రజలు 1,100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాల వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలు కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
అమరావతి అనువైందని
శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది..
శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను చంద్రబాబు వక్రీకరిస్తూ.. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్య అమరావతే రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమని సూచించిందన్నారు. అమరావతి నేల పటుత్వం విషయంలోనూ సమర్థించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. అమరావతి నేల నిర్మాణాలకు మంచిదని ఐఐటీ చెన్నై నివేదిక ఇచ్చిందన్నారు. డబ్బుల్లేవని ఇక్కడ ఉండబోమనడం సరికాదని, ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఉన్నాయని, ఇవి టెంపరరీ కాదని అన్నారు. ఈ భవనాల్లోనే ఉంటూ డబ్బులు వచ్చినప్పుడు మిగతా భవనాలు కట్టుకోవచ్చన్నారు.
దీనిపై మంత్రి బొత్స జోక్యం చేసుకుంటూ ఇవి టెంపరరీ కాకపోతే మరో రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు టెండర్లు ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. దీనికి బదులివ్వని చంద్రబాబు అమరావతిని ప్రధాని మోదీతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థించారన్నారు. భూముల విలువ పెరిగితేనే ఆదాయం వస్తుందని, అమరావతిని అలాగే చేశామని పేర్కొన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తోపాటు ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ ధరలకు భూములివ్వడం, ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు ఇవ్వడంపై మాట్లాడకపోవడం గమనార్హం.