'పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు'
విజయవాడ: పని తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నగర ఉన్నతాధికారులను హెచ్చరించారు. శనివారం విజయవాడ నగరంలో చంద్రబాబు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పాత ప్రభుత్వాసుపత్రిలో రోగులను చంద్రబాబు పరామర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సదుపాయలపై రోగలను అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది తమ వద్ద నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దాంతో చంద్రబాబు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరిండెంట్ను మందలించారు. ఇక నుంచి అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఉదయం 6.00 గంటల నుంచి నగరంలో పర్యటించాలని మేయర్, నగర కమిషనర్ను చంద్రబాబు ఆదేశించారు. బందరు కాల్వను పరిశీలించారు. ఆక్రమణలు తొలగింపు, కాల్వల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కృష్ణా నది ఒడ్డున ఉన్న 10 ఎంజీడీ రక్షిత జల కేంద్రాన్ని సీఎం పరిశీలించారు. కాల్వల ఆధునికరణకు రూ. 4 కోట్లు విడుదల చేశారు.