నేడు కుప్పంకు చంద్రబాబు రాక
అధికారం చేపట్టి 8 నెలలు
జిల్లాకు ఇచ్చిన హామీలు 25 పైనే
ఒక్క హామీ నెరవేర్చని వైనం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు
చిత్తూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 8 నెలలు గడిచిపోయింది. అధికారం చేపట్టిన తరువాత ఆయన జిల్లాకు రావడం ఇది ఆరోసారి. ఎన్నికల ప్రచారంలో, ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్ర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు చంద్రబాబు వందల కొద్దీ హామీలిచ్చారు. అందులో జిల్లాకు సంబంధించినవి 25కు పైగా ఉన్నాయి. కానీ జిల్లాకు సంబంధించి ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపాన పోలేదు. జిల్లాలో అడుగుపెట్టిన ప్రతిసారీ పుట్టిన ఊరికి అన్నీ చేసేస్తానంటూ బాబు మాటలతో జనాన్ని మభ్యపెడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి తీసుకునే చర్యలు కానరావడం లేదు. నీటి సమస్య పరిష్కారం కావాలంటే హంద్రీ-నీవా, కండలేరు పథకాలు పూర్తికావడం మినహా మరో మార్గం లేదు. కానీ ప్రభుత్వం ఆ పథకాలకు నామమాత్రపు నిధులు కూడా కేటాయించలేదు. ఇక జిల్లాలో రైతు, డ్వాక్రా రుణమాఫీ హామీలనే బుట్టదాఖలు చేసిన చంద్రబాబు ఆ తరువాత ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. సొంత నియోజకవర్గం కుప్పం రైతులు ఏనుగుల వరుస విధ్వంసాలకు తీవ్రంగా నష్టపోతున్నా వారికి సరైన పరిహారమూ ఇచ్చే పరిస్థితి లేదు. సీఎం అయిన తరువాత సొంత జిల్లాకు పలుమార్లు వస్తున్నా ఒక పనీ నేరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబు హామీలను పరిశీలిస్తే....
జిల్లాలో 40 జాతీయ, ప్రాంతీయ, సహకార బ్యాంకుల పరిధిలోని 478 బ్రాంచుల పరిధిలో 2013 డిసెంబర్ 31వనాటికి 8,70,321 మంది రైతులు 11,180.25 కోట్ల పంట రుణాలను తీసుకోగా, వారిలో 3.73లక్షల మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులంటూ బ్యాంకులు ప్రభుత్వానికి నివేదించి చేతులు దులుపుకున్నా యి. రుణమాఫీ చేస్తారని కోటి ఆశలతో ఓట్లు వేసి గెలిపించిన జనానికి చంద్రబాబు నిరాశ కల్పించారు.
డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నిక ల్లో హామీ ఇచ్చారు. తరువాత ఒక్కొక్క డ్వాక్రా మహిళకు రూ.10వేల చొప్పున ఇస్తానంటూ మా టమార్చారు. జిల్లాలో 7.8లక్షల మంది సభ్యులున్నారు. ఈ లెక్కన రూ.780 కోట్లు చెల్లించాలి. ఇంతవరకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు.
ఎన్నికల ముందు చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తానని పదేపదే చెప్పిన బాబు చిత్తూరు, గాజులమండ్యం సహకార చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో దాదాపు రూ.30 కోట్లు బకాయిలున్నా పట్టించుకోలేదు.
మేర్లపాక వద్ద ఐఐటీ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చినా అది ఆచరణ దాల్చలేదు. 450 ఎకరాల భూమిని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. వచ్చే విద్యాసంవత్సరం తరగతులు ప్రారంభిస్తామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకటించినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినా ప్రతిపాదనలేవీ కేంద్రానికి చేరని దాఖలాలు లేవు.
కుప్పంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని బాబు చెప్పినా సెప్టెంబర్‌లో పర్యటించిన ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఐఏ) చైర్మన్ అలోక్ సిన్హా ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయలేమని, అవసరమైతే ఎయిర్‌స్ట్రిప్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై ప్రభుత్వ చర్యలేవీ లేవు
సెంట్రల్ యూనివర్శిటీ హామీ గాలిలో కలిసింది. యూనివర్శిటీని అనంతపురం జిల్లాకు తరలించారు.
తిరుపతి మెగాసిటీ ప్రతిపాదన ముందుకు సాగడం లేదు. రంగంపేట సమీపంలో అటవీ భూములను డీ - నోటిఫై చేసి తిరుపతి మెగాసిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై నిర్ణయం వెలువడలేదు.
విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి మె ట్రోరైలు ప్రాజెక్టు మంజూరు చేస్తూ ప్రభుత్వం నాలు గు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వు ల్లో తిరుపతి ప్రస్తావన లేదు. తిరుపతిలో మెట్రోరైలు ప్రాజెక్టు సాధ్యసాధ్యాలను పరిశీలించే బాధ్యత శ్రీధరన్‌కు అప్పగించారు. అది ఏమైందో మరి.
జిల్లాను హార్టికల్చర్ హబ్ చేస్తానని నవంబర్ 5న పర్యటనలో చంద్రబాబు మరోమారు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలుకు చర్యలు లేవు.
తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంను ఆధ్యాత్మిక కారిడర్ చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు.
హాంద్రీనీవా రెండవ దశ పనులకు సంబంధించి 2015-16లో రూ.2,500 కోట్లు కేటాయించాలని త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. కానీ 2015 బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు.
టమాట రైతులకు రుణమాఫీని అమలుచేస్తానని తొలుత హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ తరువాత ఎకరాకు రూ.10వేల చొప్పున మాఫీ చేస్తామంటూ మాటమార్చారు. ఇప్పటికీ ఒక్క రైతుకు కూడా పైసా ఇవ్వలేదు.
మాటలేకానీ... చేతలేవి బాబూ
Published Tue, Feb 24 2015 2:46 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement