- 23 మంది నిందితులు.. 130 మంది సాక్షులు
- 4 పిస్తోళ్లు, 8 వాహనాలు, 3 కత్తులు సీజ్
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో నేర అభియోగ పత్రం (చార్జ్‌షీట్) దాఖలైంది. కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న చిత్తూరు డీఎస్పీ ఎం.లక్ష్మినాయుడు శుక్రవారం స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో న్యాయమూర్తి యుగంధర్‌కు చార్జ్‌షీట్‌ను సమర్పించారు. గత ఏడాది నవంబర్ 17న చిత్తూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ అనురాధను తుపాకీతో కాల్చడంతో పాటు ఆమె భర్త కటారి మోహన్‌ను కత్తులతో దాడిచేయడంతో వారు మృతి చెందారు.
దాడి జరిగిన రోజు ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. నవంబరు 21న వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 90 రోజుల్లో వారిపై మోపిన అభియోగాలకు సంబంధించి దర్యాప్తు అధికారి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి వచ్చింది. లేనిపక్షంలో నిందితులకు స్వచ్ఛందంగా బెయిలు మంజూరు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. 90 రోజుల గడువు శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా శుక్రవారం చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
చార్జ్షీటులో ఏముందంటే..
మేయర్ అనురాధ, మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చింటూ అలియాస్ చంద్రశేఖర్, వెంకటా చలపతి, జయప్రకాష్, మంజునాథ్, వెంకటేష్, మురుగన్, వెంకట యోగానంద్, పరంధామ, మొగిలి, శశిధర్, ఎంఎస్.యోగానంద్, ఆర్వీటి బాబు, లోకేష్, రఘుపతి, నాగరాజు, వెంకట ఆనంద్‌కుమార్, కమలాకర్, రజనీకాంత్, నరేంద్రబాబు, శ్రీనివాస ఆచారి, కాసారం రమేష్, బుల్లెట్ సురేష్ అనే 23 మంది నిందితులుగా ఉన్నారు. నిందితులపై ఐపీసీ 147, 148, 302, 307, 120 (బీ ఆర్‌డబ్ల్యూ) 149, సెక్షన్ 25 (1బీ) ఏ, 25 (1) (ఏఏఏ), 27 మారణాయుధాల నిరోధక చట్టం సెక్షన్ 212, 216 కింద (క్రైమ్ నెం.130/2105) కేసు నమోదు చేశారు.
హత్య జరిగిన తరువాత ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, మేయర్ దంపతుల మరణాన్ని ధ్రువీకరించిన వైద్యులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి నిపుణులు ఇచ్చిన నివేదికలతోపాటు దర్యాప్తు అధికారి మొత్తం 130 మందిని సాక్షులుగా చేర్చారు. ఈ ఘటనలో నిందితుల నుంచి నాలుగు పిస్తోళ్లు, 8 వాహనాలు, మూడు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో నిందితుల పాత్ర, మృతులతో వీరికి ఉన్న కక్షలు, సంబంధాలపై సవివరంగా పేర్కొన్నారు. ఈ కేసులో ఆర్వీటి బాబు, కాసారం రమేష్, వెంకట ఆనంద్‌కుమార్ బెయిల్‌పై విడుదలయ్యారు. మిగిలిన 20 మంది రిమాండు ఖైదీలుగా పలు జైళ్లలో ఉన్నారు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
మేయర్ హత్య కేసులో చార్జ్‌షీట్ దాఖలు
Published Sat, Feb 20 2016 12:54 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement