కఠారి అనురాధ, మోహన్(ఫైల్)
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన కఠారి మోహన్‌తో ఆ పార్టీలోనే కొందరికి వర్గవిభేదాలున్నాయా? మోహన్‌ను అంతమొందించేందుకు అధికారపార్టీ నేతలే కుట్రపన్నారా? ఇందుకోసం అధికారమూ.. ఆధిపత్యమూ నీదేనంటూ మేనల్లుడు చింటూను రెచ్చగొట్టారా? వారి భరోసాతోనే చంపేంత పగలేకపోయినా చింటూ మేనమామ కఠారి దంపతులను హత్యచేశాడా?.. ఈ ప్రశ్నలకు రాజకీయవర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. హత్య వెనుక అధికారపార్టీ నేతల కుట్ర ఉండడంలో ఆశ్చర్యం లేదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే అంటున్నట్టు ప్రచారం జరుగుతుండడం గమనార్హం.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ నేతల్లో అక్కసు..
చిత్తూరు పరిధిలోని ఓ ముఖ్యనేత, మరికొందరు స్థానిక నేతల అండతో కఠారి మోహన్ టీడీపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో గొడవల నేపథ్యంలో ఆయనకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చింది. నగరానికి చెందిన కొందరు అధికారపార్టీ నేతలు ఇది జీర్ణించుకోలేకపోయారు.
మోహన్ భార్య అనురాధ మేయర్ అయ్యాక ఆ కుటుంబం ఎవర్నీ లెక్కచేయట్లేదని, నగర పరిధిలో అభివృద్ధి పనుల కేటాయింపులోనూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో ఓ ప్రజాప్రతినిధితోపాటు మరో ముగ్గురు అధికారపార్టీ నేతలు మోహన్‌పై అక్కసు పెంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఎమ్మెల్యే టికెట్‌కోసం పోటీపడిన మోహన్.. వచ్చే ఎన్నికల్లో టికెట్‌కోసం గట్టి పోటీదారయ్యే అవకాశముండడంతో వారు ఆయన ఆధిపత్యానికి అడ్డ్డుకట్ట వేసేందుకు పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారపార్టీలో అంతర్గతపోరు ముదిరిపోయింది.
చింటూను రెచ్చగొట్టారా?
మామ కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన చంద్రశేఖర్ అలియాస్ చింటూ, మోహన్ మధ్య కుటుంబ కలహాలు రేగాయి. దీనికిసైతం కొందరు అధికారపార్టీ నేతలే బీజం వేశారనే ప్రచారముంది. తరువాత పార్టీలోని కఠారి వ్యతిరేకవర్గం మామాఅల్లుళ్ల మధ్య ఆజ్యంపోసి విభేదాలు తారస్థాయికి చేరేలా చేసిందని ప్రచారం జరుగుతోంది. మూడున్నరేళ్ల అధికారం ఉంది.. మామపోతే అధికారం నీదే, ఆధిపత్యం నీదేనంటూ చింటూను రెచ్చగొట్టినట్లు సమాచారం.
ఇలాగే వదిలేస్తే రాబోయే మూడేళ్లలో మీ మామ మరింత ఎదుగుతారని, ఆపై ఎమ్మెల్యే అయినా ఆశ్యర్యపడాల్సిందిలేదని, అదే జరిగితే అత్త కుటుంబానిదే పెత్తనమంటూ రెచ్చగొట్టినట్లు, నీ వెనుక మేముంటామంటూ వారు భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో మేనమామ కుటుంబంపై దాడికి చింటూ తెగబడినట్లు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. అధికారపార్టీ నేతల అండలేకుండా చింటూ హత్యాకాండకు దిగేంత సాహసం చేయలేడని రాజకీయవర్గాలతోపాటు కఠారి వర్గం సైతం భావిస్తున్నట్లు సమాచారం.
కుట్రకోణంపై పోలీసు విచారణ
కఠారి దంపతుల హత్యపై పోలీసు, నిఘా విభాగాలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. కఠారి కుటుంబంతో అధికారపార్టీలో ఎవరెవరికి విభేదాలున్నాయి? వారిలో హత్యను ప్రోత్సహించిందెవరు? చింటూకు భరోసా కల్పించిందెవరు? సహకరించిందెవరు? అన్నకోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
విభేదాలకు సంబంధించి కఠారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, అనుచరులు, కొందరు అధికారపార్టీ నేతలనుసైతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే మోహన్‌ను హత్యచేసేందుకు సొంత పార్టీలో ఎవరు కుట్ర పన్నారన్న విషయానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సీఎంకు మినహా ఏ ఒక్కరికీ బహిర్గతం చేయరాదని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేసిన ట్లు విశ్వసనీయ సమాచారం.