తనిఖీల పేరుతో వసూళ్లు | checking | Sakshi
Sakshi News home page

తనిఖీల పేరుతో వసూళ్లు

Published Thu, Jul 2 2015 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

checking

కడప అగ్రికల్చర్:  ఎరువుల దుకాణాల్లో అక్రమాలు జరగకుండా నివారించాలనే ఉద్దేశంతో ఇటీవల జిల్లా వ్యవసాయశాఖ ఇన్‌చార్జ్ జేడీ జ్ఞానశేఖర్ వ్యవసాయాధికారులను డివిజన్ల వారీగా నియమించి తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఓ వ్యవసాయాధికారి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎరువుల దుకాణ యజమానుల నుంచి ముక్కు పిండి దాదాపు 50 వేల రూపాయలు వసూలు చేసుకున్నారు. అధికారుల బృందం పోరుమామిళ్ల డివిజన్‌లో ఎరువుల దుకాణాలు తనిఖీలు చేయడానికి వెళ్లారు.
 
 ఆ బృందంలోని ఓ అధికారి రికార్డులు సరిగాలేవని, తాను తలచుకుంటే షాపులను సీజ్‌చేస్తానని బి. మఠం మండలంలోని దుకాణదారులను బెదించి అందినకాడికి దోచుకుని తిరుగుముఖం పడుతుండగా ఓ మండల వ్యవసాయాధికారి సమీపంలోని దుకాణాన్ని తనిఖీ చేస్తూ కనిపించాడు. అంతే...ఆ అధికారి అక్కడి వెళ్లి నా అనుమతి లేకుండా నీవు డబ్బులు వసూలు చేసుకోవడానికి వ చ్చావా అంటూ ఆ అధికారి మండల అధికారిని గద్దించినట్టు సమాచారం. దుకాణాల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం ఆనోటా...ఈ నోటా పడి అధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ అధికారి, జిల్లా జేడీ కార్యాలయంలో పనిచేసే అధికారులు కొందరు ఉన్నతాధికారి వద్ద బుధవారం రాత్రి పంచాయితీ పెట్టినట్లు సమాచారం.
 
  వ్యవసాయశాఖకు చెడ్డపేరు తెచ్చే పనులు ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించి తగు చర్యలు తీసుకుంటామని ఆ ఉన్నతాధికారి తెగేసి చెప్పినట్లు సమాచారం. గత ఏడాది కూడా ఓ అధికారి ఇలాగే అవినీతికి పాల్పడగా పత్రికల్లో కథనాలు రావడంతో బదిలీపై వెళ్లిపోయారు. ఇప్పుడు అదే బాటలో మరో అధికారి పయనిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement