కడపలో డబ్బు కోసం వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు.
వైఎస్సార్ జిల్లా: కడపలో డబ్బు కోసం వరుసకు అన్న అయ్యే వ్యక్తిని ఓ యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. కాళ్లు చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
కడపలోని చెమ్ముమియాపేటకు చెందిన పగడాల అశోక్(27) రాయంపేటలోని మహేంద్ర ట్రాక్టర్స్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం అతని ఇంటికి వచ్చిన పెదనాన్న కుమారుడు నరేష్ పని ఉందని బైక్‌పై తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అశోక్ తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు సోమవారం తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తులో భాగంగా నరేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తన భార్యతో విడాకులు తీసుకునేందుకు డబ్బు అవసరముండటంతో అశోక్‌ను డబ్బులు అడిగానని.. అందుకు అతను నిరాకరించడంతో.. హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసే పనిలో ఉన్నారు.