
శిథిల స్వప్నం
పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం పరాయి రాష్ట్రానికి వెళ్లిన పేద కూలీలపై విధి కన్నెర్ర చేసింది. పిల్లలను ఆకలితో ఉంచలేక నాలుగు రాళ్లు సంపాదిద్దామని వెళ్లిన కూలీల పాలిట.. తాము కష్టించి నిర్మించిన భవనమే మృత్యుపాశమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూలీలు చెన్నైలోని పోరూరుకు సమీపంలో మాంగాడు మౌలివాకం ప్రాంతంలో పనికి కుదిరారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. వర్షం కురుస్తున్న వేళ పనులు చేస్తుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయి 10 అడుగుల లోతులో కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో జిల్లాకు చెందిన పదిమంది చిక్కుకున్నారు. శిథిలాలు తొలగిస్తేనే గానీ వారి యోగక్షేమాలు తెలిసే అవకాశం లేదు. వారు కొనప్రాణంతోనైనా బతకాలని వారి కుటుంబ సభ్యులు కన్నీటితో భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
శ్రీకాకుళం: నెల క్రితం కూలి పనులకు చెన్నై వెళ్లిన కొందరు... మాకు పని కుదిరింది...మీరూ వస్తే పని దొరుకుతుందని చెప్పి కొందరిని తీసుకువెళ్లారు. వారు వెళ్లిన కొద్ది రోజులకే మరింత మందిని తీసుకొని వెళ్లారు... ఇలా జిల్లాకు చెందిన పలువురు కూలీలు ఒకే చోట పనిచేస్తున్నారు. శనివారం నాటి ప్రమాదంలో నరసన్నపేట, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాలకు చెందిన 10మంది చిక్కుకున్నారు. వీరు ప్రాణాలతో ఉన్నదీ లేనిదీ చెన్నై అధికారులు ధ్రువీకరించలేకపోతున్నారు. ఈ వార్తతో జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రానికి వలస వెళ్లిన వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. వారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు ఫోన్ చేస్తుండగా ఫోన్లు పనిచేయక పోవడంతో వారిలో మరింత ఆందోళన ప్రారంభమైంది. అయితే అధికారుల నుంచి ఏ సమాచారం అందుతుందేమోనని వారి కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం రాత్రంతా జాగారం చేస్తున్నారు.
కడుపు నింపుకుందామని సుదూర ప్రాంతాలకు వెళ్లిన తమ వారిని భవనం రూపంలో మృత్యువు కాాటేసిందని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం వేళ భవనం కూలడం వలన, వర్షం పడుతుండడం వలన సహాయ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతున్నట్టు చెన్నై నుంచి బాధితుల బంధువులు చెబుతున్నారు. శిథిలాల కింద వందమందికి పైగా చిక్కుకున్నట్టు వారు తెలిపారు. కొందరు పారిపోయారని ఎవరెక్కడ ఉన్నారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అందులో జిల్లా వాసులు కూడా మరింత మంది ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి విషయాలు తెలుసుకొని పొట్ట కూటి కోసం చెన్నై వెళ్లిన వారి కుటుంబాలు మరింత ఆవేదనతో ఉన్నాయి. అయినా వారికి సరైన సమాచారం అందించే నాధుడే లేకుండా పోయాడు. ఆదివారం సహాయ కార్యక్రమాలు ముమ్మరం అయితే పూర్తి వివరాలు అందే అవకాశాలు ఉంటాయి.
తమిళనాడు అధికారులు ధ్రువీకరించడం లేదు
జేసీ వీరపాండ్యన్ జిల్లాకు చెందిన వలస కూలీలు మృతి చెందినట్టు తమిళనాడు అధికారులు ధ్రువీకరించడం లేదని జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ సాక్షికి తెలిపారు. ఇప్పటికే తాను రెండుసార్లు తమిళనాడు అధికారులతో మాట్లాడానన్నారు. మండలాల నుంచి మాత్రం వలస కూలీల బంధువుల ఆక్రందనల వలన తహశీల్దార్లు స్పందించి సమాచారం అందించార,ని అది వాస్తవమో కాదో నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత కొంత వాస్తవ సమాచారం రావచ్చని అభిప్రాయపడ్డారు.
జేసీతో మాట్లాడిన అచ్చెన్న
చెన్నై ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జాయింట్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు తమిళనాడు అదికారులతో మాట్లాడాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో కూడా అధికారులు మాట్లాడుతున్నారని ఎప్పటికప్పుడు జిల్లాకు సమాచారాలు అందిస్తామని తెలిపారు.