ఎత్తుకు పై ఎత్తు చదరగం
చెస్ పావుల పేర్లు కింగ్(రాజు), క్వీన్(మంత్రి), రాక్స్(ఏనుగు)-2, బిషప్స్(శకటం)-2, నైట్స్(గుర్రం) 2, పాన్స్(బంటు)-8 ఉంటాయి.
సాక్షి, కర్నూలు డెస్క్ : చెస్ (చదరంగం) ఆట అతి పురాతనమైనదిగా చెప్పవచ్చు. మన దేశంలో గుప్త చక్రవర్తి 6వ శతాబ్దంలో చతురంగ పేరుతో ఆట మొదలు పెట్టారని చరిత్రకారులు చెబుతుంటారు. అనంతరం కుషన్ చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రారంభించారు. మాడ్రన్ చెస్ సౌతర్న్ యూరప్‌లో 1850లో ప్రారంభించారు. ఇండియాలో చెస్‌కు ప్రముఖ స్థానం ఉంది. దేశంలో అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు ఉన్నారు. దేశానికి చెందిన విశ్వనాథన్‌ఆనంద్ పలుసార్లు ప్రపంచచాంపియన్‌గా నిలిచారు. రాష్ట్రానికి చెందిన పలువురు చెస్ క్రీడాకారులు గ్రాండ్‌మాస్టర్ హోదా పొందారు.
ఆడే విధానం...
కుడి చేతివైపు తెల్లగడి ఉండేలా బోర్డును ఏర్పాటు చేయాలి. మొదటి వరుసలో చివరి మూల గళ్లలో ఏనుగులు, వాటి పక్కన గుర్రాలు, వాటి పక్కన శకటాలు అమర్చాలి. ఆ తర్వాత మిగిలిన గళ్లలో రాజు, మంత్రి పెట్టాలి. నల్లమంత్రి నల్ల గడిలో, తెల్లమంత్రి తెల్ల గడిలో ఏర్పాటు చేయాలి. రెండో వరుసలో ఎనిమిది బంట్లను అమర్చాలి. ముందువరుసలో ఉండే పావులు ముందుకు, వెనక్కి కదలవచ్చు. కానీ బంటుకు వెనక్కి వచ్చే అవకాశం ఉండదు.
గేమ్‌ను తొలుత తెల్లపావులతో ప్రారంభిస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఎత్తు వేసుకుంటూ పోతారు. పావును వాటివాటి నియమాల ప్రకారం ఏదేని ఖాళీ గడికి కానీ, ఎదుటి పావులను చంపి, ఆ పావులున్న గడికి కానీ కదలవచ్చు. ఏదైనా పావుకు రాజును చంపే సామర్థ్యం ఉండే ఎత్తు వేస్తే చెక్ అని చెప్పాలి. ఆ సమయంలో ప్రత్యర్థి ఆటగాడు రాజును పక్కకు జరిపి కానీ.. చెక్ పెట్టిన పావును తన పావులతో చంపికానీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి. ఈ రెండూ సాధ్యం కాకపోతే చెక్ పెట్టిన ఆటగాడు గేమ్ గెలిచినట్లవుతుంది.
ఆట నియమాలు...
రాజు అడ్డంగా కానీ, నిలువుగా కానీ, క్రాస్‌గా కానీ ఒక్క గడి మాత్రమే కదిలే వీలుం టుంది. రాజుకు ఆట మొత్తంలో ఓ సారి కాస్లింగ్(కోట కట్టడం) చేసుకునే అవకాశం ఉంటుంది. కోటకట్టే ముందు రాజుకు చెక్ ఉండకూడదు. రాజుకు ఏనుగుకు మధ్య ఏ పావులూ ఉండ రాదు.
మంత్రి అడ్డంగా కానీ నిలువుగా కానీ క్రాస్‌గా కానీ ఎన్ని గళ్లు అయినా కదలవచ్చు. కదిలే గడికి ప్రస్తుతమున్న గడికి ఖాళీ గళ్లు ఉండాలి.
ఒంటె (శకటం) మూలగా (క్రాస్) ఎన్ని గడులైన కదలవచ్చు. కదిలే గడికి ప్రస్తుతమున్న గడికి మధ్య అన్ని ఖాళీ గడులు ఉండాలి.
బంటు ఎప్పుడైనా ఒక గడి ముందుకు వెళ్లగలదు. ప్రారంభంలో మాత్రం రెండు గడులు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేసే అవకాశం లేదు.
ఏనుగు అడ్డంగా కానీ, నిలువు గా కానీ ఎన్ని గళ్లు అయినా కదలవ చ్చు. కదిలే గడికి, ప్రస్తుతమున్న గడి కి మధ్య అన్నీ ఖాళీ గడులుండాలి.
గుర్రం ఇతర పావులకు కంటే దూకుడుగా ఉంటుంది. ఉన్న గడి నుంచి రెండు గళ్లు అడ్డంగా ఒక గడి నిలువుగా లేదా రెండు గళ్లు నిలువుగా ఒక గడి అడ్డంగా ఇంగ్లిష్ అక్షరం ‘ఎల్’ లాగా కదులుతుంది. దారిలోని గడులలో పావులు ఉన్నా చేరాల్సిన స్థానంలో ఖాళీ ఉంటే చాలు. పావు కదపవచ్చు.