కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయూలి
Published Sun, Aug 11 2013 4:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ :కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూ సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. మంచిర్యాలలోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం తన స్థాయిని మరిచి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. సీమాంధ్రులకు తొత్తుగా మారాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సమస్యలు అనేకం అంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో విద్యుత్, నీరు, ఉద్యోగాలు తదితర అంశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తబోవని, కేవలం సీమాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకే సీఎం ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదన్నారు. మూడు నెలల్లో తెలంగాణ రాష్ర్టం ఏర్పాటవుతుందన్నారు. విభజనపై వ్యక్తమవుతున్న విభేదాలు, ఆందోళనలను పరిశీలిస్తూ వాదనలు వినేందుకే అంటోని కమిటీ వస్తోందని, విభజనను అడ్డుకునేందుకు కాదని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తథ్యమైన తరుణం లో జిల్లాల ఏర్పాటు ప్రాతిపదికన మంచిర్యాలను అన్ని వర్గాల సహకారంతో జిల్లాగా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రైల్వే, రోడ్డు మార్గాలతోపాటు రెవెన్యూ తదితర అన్ని అంశాలపరంగా జిల్లా ఏర్పాటుకు మంచిర్యాల అనువుగా ఉందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, మాజీ కౌన్సిలర్ యై తిరుపతి, నాయకులు సిరిపురం శ్రీనివాస్, తోట తిరుపతి, యాదగిరిరావు, మల్లికార్జున్, బోయిని శ్రీనివాస్, హన్మంతరావు పాల్గొన్నారు.
Advertisement