కళ్ల ముందే కన్నకూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. దేవుడు తమకు అన్యాయం చేశాడంటూ వారు రోదించిన
చిన్నారిని బలిగొన్న లారీ
Published Fri, Dec 27 2013 4:29 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
తాడేపల్లిగూడెం క్రైం, న్యూస్‌లైన్ : కళ్ల ముందే కన్నకూతురు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. దేవుడు తమకు అన్యాయం చేశాడంటూ వారు రోదించిన తీరు రోడ్డున వెళ్లే వారిని సైతం కదిలించింది. తాడేపల్లిగూడెంలోని తణుకు రోడ్డులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలికకు
తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
ఉంగుటూరు మండలం నీలాద్రిపురానికి చెందిన పొట్ల వెంకట్రావు వ్యవసాయ కూలి. అతని భార్య గంగా భవాని పుట్టినిల్లు తాడేపల్లిగూడెం మండలంలోని కృష్ణాయపాలెం. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వెంకట్రావు భార్యా,పిల్లలతో బైక్‌పై ఉదయం కృష్ణాయపాలెం వెళ్లారు. అస్వస్థతకు గురైన గంగాభవాని తల్లి పెద్దింట్లమ్మను పరామర్శించి సాయంత్రం నీలాద్రిపురం వెళుతుండగా తాడేపల్లిగూడెం-తణుకు రోడ్డు లోని చెక్‌పోస్టు సమీపంలో పోలీస్ ఐలాండ్ వైపు వెళుతున్న క్వారీ లారీ వెనుక నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నకుమార్తె సుమలత(6) తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
మరో కుమార్తె కల్పనశ్రీతో పాటు వెంకట్రావు, గంగాభవానీలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కల్పనశ్రీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులను కూడా ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీడ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై ఆకురాతి అప్పారావు పరిశీలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు.
Advertisement
Advertisement