అమ్మ ఒడే వెచ్చన..! | Children Safety in Winter Season Special Story | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడే వెచ్చన..!

Published Fri, Dec 13 2019 1:09 PM | Last Updated on Fri, Dec 13 2019 1:09 PM

Children Safety in Winter Season Special Story - Sakshi

శీతాకాలం..మంచు కురిసే వేళలు, జివ్వు మనిపించే చల్లని పిల్ల గాలులు. కంటికిఅందంగా కనిపించే ప్రకృతి సోయగాలు. అంతవరకు బాగానే ఉంది. ఈ కాలంరోగాలకు కూడా నిలయమే. కాస్త ఏమరుపాటుగా ఉన్నా, అనారోగ్యానికి గురికావాల్సిందే. ఉన్నఫళంగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. దీంతో చలితీవ్రత పెరిగింది. ఫలితంగా శరీరంలోని ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి.ఈ వ్యత్యాసాల కారణంగా  ప్రధానంగా చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ శీతాకాలంలో బాలలఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిఉంది. అందుకు సంబంధించి‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

కడప రూరల్‌: ఇటీవల వాతావరణం విచిత్రంగా మారుతోంది. మొన్నటి వరకు వర్షాలు కురిశాయి.  అంతలోనే వేసవిని తలపించేలా ఎండలు కాశాయి. ఇప్పుడు ఉన్న ఫళంగా చలి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనిష్టం 19, గరిష్టం 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో చలి తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

ఆరు విభాగాలుగా బాలల దశ..
బాలల దశను 6 విభాగాలుగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామ క్రమం అప్పుడే పుట్టిన బిడ్డల నుంచి 18 ఏళ్ల వరకు ఉంటుంది.
అప్పుడే జన్మించి 28 రోజుల లోపు చిన్నారులను నుయో నెట (పురిటి బిడ్డ లేదా చంటి బిడ్డ) అంటారు.
ఒక ఏడాదిలోపు పిల్లలను ఇన్‌ఫంట అని పిలుస్తారు.
రెండు నుంచి మూడేళ్లలోపు వారిని టాగ్లర్‌ (తప్పటడుగులు వేసే దశ) అంటారు.
మూడు నుంచి ఐదేళ్లలోపు బాలలను ప్రీ స్కూల్‌ (స్కూల్‌కు వెళ్లడం కంటే ముందు దశ) అంటారు.
ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులను  స్కూల్‌ ఏజ్‌ (పాఠశాలకు వెళ్లడం) పిల్లలు అని పిలుస్తారు.
9 నుంచి 18 సంవత్సరాల లోపు వారిని అడలసెన్స్‌ (కౌమార) దశ అంటారు.  

శరీరంలో ఉష్ణోగ్రతలే కీలకం..
ఈ శీతాకాలంలో చల్లని వాతావరణం చిన్నారుల శరీరంలోని ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా శరీరంలో 36.5 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు ఉండాలి. ఈ చలి కాలంలో ఆ ఉష్ణోగ్రతలు తగ్గు ముఖ పట్టేంందుకు ఆస్కారం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టినప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఈ ప్రభావం చంటి బిడ్డలపై పడుతుంది.

వ్యాధుల లక్షణాలు...
ఈ చలికాలంలో పలు రకాల వ్యా ధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందుకు సంబంధించిన లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
పాలు తాగలేకపోవడం..ఆహారం తినకపోవడం
చర్మం పొడిగా ఉండడం..పగుళ్లు ఏర్పడడం, శరీరంపై దద్దుర్లు
జలుబు, దగ్గు, అలర్జీ, నిమోనియా, వైరస్‌లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు
వైరస్‌తో వచ్చే కండ్లకలక, ముక్కు దిబ్బడ, చెవినొప్పి

నివారణ మార్గాలు...
శరీరంలో ఉష్ణోగ్రతలు నిలకడగా ఉండాలంటే చలిలో ఎక్కువగా తిరగకపోవడమే మంచిది.
ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే చలి నియంత్రణ దుస్తులను ధరించాలి. కాళ్లకు సాక్స్‌లు. చేతులకు గ్లౌజ్‌లు తొడగాలి.

ఆహార నియమాలు ఇలా...
పురిటి బిడ్డలకు ఆరు నెలలు వచ్చే వరకు తల్లి పాలే శ్రేయస్కరం
ఆరు నెలల తరువాత వైద్యులు సూచించిన ఆహారం అందించాలి
ఇక చిన్నారులకు తాజా కూరగాయలు, తాజా పండ్లను తినిపించాలి
వేడిగా ఉండే ఆహార పదార్థాలను ఇవ్వాలి
గోరు వెచ్చని నీరు తాగాలి..అలాగే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.  
సొంత వైద్యం మంచిది కాదు..ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం వైద్యులను సంప్రదించాలి.

‘కంగారు మదర్‌కేర్‌’ విధానంతో..
చలికాలంలో చంటి బిడ్డలపై కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం చూపడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అంటే చలి తీవ్రతకు చిన్నారుల శరీరం తట్టుకోలేదు. ఫలితంగా శరీరంలోని ఉష్ణోగ్రతలు పడిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ ముక్కుపచ్చలారని చిన్నారులు అనారోగ్యానికి గురవుతారు. ఇందుకు సహజసిద్ధంగా చేసే ప్రక్రియ ఒకటుంది. అదే ‘కంగారు మదర్‌ కేర్‌’ విధానం. ఆస్ట్రేలియాలోని జంతువులైన కంగారులు, ఒక దశకు వచ్చే వరకు తమ పిల్లలను శరీరంలోని తిత్తిలాంటి చిత్తిలో వేసుకొని సంరక్షిస్తాయి. తద్వారా తమ బిడ్డలకు తగిన ఉష్ణోగ్రతలను అందిస్తుంటాయి. ఆ విధానాన్నే కంగారు మదర్‌ కేర్‌ అంటారు. అంటే తల్లి తమ బిడ్డలను ఎదపై ఉంచుకోవడం ద్వారా ఉష్ణోగ్రతలు పడిపోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించవచ్చు.ఇదే విధానాన్ని తండ్రి కూడా చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement