గుహలోని చిన్నారులను అర్ధరాత్రి బయటకు తీసిన పోలీసులు
వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటి టౌన్: రాయచోటి పరిధిలో చీకటి గుహలో చిక్కుకున్న చిన్నారులకు విముక్తి లభించింది. పోలీసులు, గ్రామస్తులు శ్రమించి చాకచక్యంగా ఎట్టకేలకు అర్ధరాత్రి ముగ్గురు పిల్లలను సురక్షితంగా గుహ నుంచి బయటకు తీసుకొచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు చిన్నారులు..వీరిలో ఇద్దరు(రెడ్డిబాబు, గిరిబాబు) ఆరో తరగతి చదువుతున్నారు. మరో బాలుడు సురేష్ మూడో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ కావడంతో స్కూళ్లకు సెలవులు..వీరిది రాయచోటి రూరల్ పరిధిలోని మాధవరం వడ్డెపల్లె..సోమవారం మధ్యాహ్నం వీరంతా ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటుండగానే సాయంత్రమైంది. సరదాగా కొండెక్కుదామనుకున్నారు. 500 మీటర్ల మేర ఎక్కేశారు.
తీరా అక్కడికి చేరేసరికి చీకటి పడిపోయింది. దీంతో దగ్గరలోని గుహలో చిక్కుకుపోయారు. ఈలోగా వారి తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి రాకపోయే సరికి వెతకసాగారు. ఎందుకైనా మంచిదని కొండమీదకు వెళ్లారేమోనని సందేహించారు. పోలీసులకు తెలియజేశారు. వెంటనే గ్రామస్తులను వెంటబెట్టుకుని పోలీసులు కొండెక్కారు. గుహ సమీపంలో పిల్లల అలికిడి వినిపించింది. అక్కడే లోపల ఉన్నారని గమనించారు. గుహలో వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఒక సెల్‌ఫోన్ లోపలికి తాడు సాయంతో పంపి మరొకరు ఫోన్ చేశారు. ఆ ఫోన్‌లో చిన్నారులు మాట్లాడారు. వారికి వాటర్ బాటిల్ కూడా పంపారు. గుహలోకి పోయేందుకు వీలు లేకుండా ఉంది. ప్రయత్నాలు ఆపకుండా చేస్తూనే ఉన్నారు. తాడు సాయంతో గుహలోకి ఒకరిని పంపి అత్యంత చాకచ క్యంగా ముగ్గురు పిల్లలను ఎట్టకేలకు అర్ధరాత్రి బయటికి తీసుకొచ్చారు. దీంతో ఉత్కంఠ వీడింది. వారి తల్లిదండ్రులలో ఆనందం వెల్లివిరిసింది.
Comments
Please login to add a commentAdd a comment