సాక్షి, ఏలూరు టౌన్ : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ చింతమనేని అనుచరులు తనను బెదిరిస్తున్నారంటూ చెరుకు జోసఫ్ ఏలూరు డీఎస్పీ ఒ.దిలీప్‌కిరణ్‌కు బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. తమ మాట వినకుంటే ఇబ్బందులు తప్పవని, తనను అంతం చేస్తామని బెదిరిస్తున్నారని, ఏవో సంభాషణలు సెల్‌ఫోన్లలో తాను వారితో మాట్లాడినట్లుగా రికార్డు చేసి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని భయపెడుతున్నారని వివరించారు. దెందులూరు గ్రామానికి చెందిన పెనుబోయిన మహేష్, మరో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తనను తరచూ బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కావాలంటూ డీఎస్పీకి విన్నవించారు. మహేష్ అనే వ్యక్తికి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రోత్సాహం ఉండడం వల్లే తనను బెదిరిస్తున్నాడని, తాను అనని మాటలను అన్నట్లుగా రికార్డు చేసి, వాటిని టీడీపీ నేతలతో ప్రెస్‌మీట్ పెట్టించి, అబద్ధాలు చెప్పిస్తూ, తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడినైన తనకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.
అసలేం జరిగిందంటే..
పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరకు జోసఫ్‌పై చింతమనేని, అతని అనుచరులు కొందరు గత నెల 29న దాడికి పాల్పడ్డారు. దీంతో జోసఫ్ ఫిర్యాదు మేరకు పెదవేగి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీంతో నాలుగు రోజులుగా పరారీలో ఉన్న చింతమనేని, అతని అనుచరులు బాధితులపై బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితుడు డీఎస్పీని ఆశ్రయించారు. చింతమనేని అరెస్టు కావటం ఖాయమని తెలుసుకునే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బాధితుడి పక్షాన డీఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీకుమార్, నాయకులు దేవానంద్, జాలా రాజీవ్, భూస్వామి, కృష్ణా, కామిరెడ్డి నాని తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment