
ఏలూరు టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఏకంగా మహిళా సర్పంచ్ అభ్యర్థిపైన, ఆమె అనుచరులపైన దాడికి తెగబడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. చింతమనేనిని అరెస్ట్ చేశారు. పెదవేగి మండలం బి.సింగవరం సర్పంచ్ పదవికి వైఎస్సార్‌సీపీ అభిమాని పరస సరస్వతి పోటీచేస్తున్నారు.
బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో సరస్వతి ప్రచారం చేస్తుండగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో వచ్చి అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు బెజవాడ రాట్నాలు వీరాస్వామి, బెజవాడ కోదండరామయ్య, చిత్తూరు సత్యనారాయణ వారిపై దాడిచేశారు. చింతమనేని ప్రభాకర్ అభ్యర్థి సరస్వతి, ఆమె భర్త సాంబశివరావులపై దాడిచేసి కర్రతో తీవ్రంగా కొట్టారు. ఈ మేరకు బాధితులు పెదవేగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చింతమనేనిని ఏ1 ముద్దాయిగా పేర్కొంటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గురువారం చింతమనేనిని అరెస్టు చేసి ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.