
బెంగళూరు నుంచి చిత్తూరు వచ్చిన చింటూ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ బెంగళూరు నుంచి కారులో చిత్తూరు చేరుకుని న్యాయస్థానంలో లొంగిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కాగా చింటూతో పాటు పారిపోయిన డ్రైవర్ వెంకటేష్ ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అతను కూడా న్యాయస్థానంలో లొంగిపోతాడనే సమాచారం రావడంతో చిత్తూరులోని న్యాయస్థానాల సముదాయం వద్ద గట్టి నిఘా ఉంచారు.
పెరిగిన దర్యాప్తు వేగం: చింటూ లొంగిపోవడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం పెంచారు. కేసులో సంబంధాలున్నాయని, హత్య కుట్ర తెలుసుననే ఆరోపణలపై కొందరు టీడీపీ నాయకులతో పాటు ఇద్దరు న్యాయవాదులు, మరికొంత మంది ప్రముఖుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. అలాగే చిత్తూరుకు చెందిన మాజీ కౌన్సిలర్, ఓ కార్పొరేటర్, నీళ్ల వ్యాపారం చేసే మరో వ్యక్తి, లారీల యజమాని ఒకరు, ఎర్రచందనం కేసు ఉన్న వ్యక్తి, శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డులోని ఓ సభ్యుడిని 48 గంటలుగా విచారిస్తున్నారు.