ఆ గడ్డ నేరాలకు అడ్డా..!
► నేర సామ్రాజ్యం వైపు అడుగులేస్తున్న చిన్న ముంబై యువకులు
► హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదం షరామామూలే
► తరచూ అరాచకాలకు పాల్పడుతున్న కిరాయి మూకలు
► రోజురోజుకూ దిగజారుతున్న పోలీసు ప్రతిష్ట
చిన్న ముంబైగా పేరొందిన చీరాలలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. సుమారు 400 ఏళ్ల క్రితం ఏర్పడిన చీరాల నేడు జిల్లాలోనే నేరాలకు నిలయంగా..ఘోరాలకు అడ్డాగా మారింది. హత్యలు, హత్యాయత్నాలు, లైంగిక దాడులు, దోపిడీలు, జూదాలు నిత్య కృత్యమయ్యాయి. నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ కళ్లప్పగించి చూస్తోంది. పోలీసు అధికారులైతే అవినీతి మరకలంటించుకుని ఖాకీ వ్యవస్థకే చెడ్డపేరు తెస్తున్నారు. దొంగతనాలు జరిగి ఏళ్లు గడుస్తున్నా రికవరీల సంగతి గాలికొదిలేశారు. – చీరాల
చీరాల: ఒకప్పుడు జిల్లా కేంద్రమైన ఒంగోలులో మాత్రమే ప్యాక్షన్, కిరాయి హత్యలు జరిగేవి. ప్రస్తుతం అది ఒంగోలు నుంచి చీరాలకు మారింది. గడచిన మూడు నెలల్లో చీరాల నియోజకవర్గంలో మూడు హత్యలు జరిగాయి. పాత కక్షలు నేపథ్యంలో మూడు నెలల క్రితం రౌడీ షీటర్ కత్తి శ్రీను సైకిల్‌పై రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా పాత ప్రసాద్ థియేటర్ సమీపంలోని బోసు నగర్‌లో అతని సమీప బంధువులు క్రికెట్ బ్యాట్లతో తలపై మోది హత్య చేశారు. నెల క్రితం వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో మరో హత్య జరిగింది. పెరుగు శ్రీనివాసరావుకు చెందిన రొయ్యల చెరువుల వద్దకు గుంటూరు జిల్లాకు చెందిన రాజు పోతురాజురెడ్డి తన భార్యతో కలిసి కాపలాగా వచ్చాడు.
పోతురాజు రెడ్డి భార్యతో చెరువుల యజమాని వివాహేతర సంబంధం నెరపుతున్నాడు. విషయం రెడ్డికి తెలిసి భార్యను మందలించాడు. చివరకు రెడ్డిని మరోవ్యక్తి సాయంతో కొట్టి చంపేశారు. వారం క్రితం వేటపాలెం మండలం పాత పందిళ్లపల్లికి చెందిన రొయ్యల సాగు చేసే తిరుమల శ్రీహరిని అతని సొంత బావ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చీరాలలో కిరాయి హంతక ముఠాలు ఏర్పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చంపేందుకు కొందరు సుఫారీలు తీసుకుంటున్నారు. చెన్నంబొట్ల అగ్రహరంలో ట్రిపుల్ మర్డర్ నిందితునులను హత మార్చేందుకు ఓ ముఠా సుఫారీ తీసుకుంది. నగదు పంచుకునే విషయంలో విభేదాలు ఏర్పడి ముఠా సభ్యులే ఒకరినొకరు హత మార్చుకునేందుకు సిద్ధమై చివరకు పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.
జోరుగా జూదం
పేదలు అధికంగా జీవించే చీరాలలో జూదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. చేనేతలు అధికంగా నివసించే జాండ్రపేట, దేశాయిపేట, ఈపురుపాలెం, పేరాల ప్రాంతాల్లో సింగిల్ నంబర్ లాటరీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెన్సెక్స్ పాయింట్ల అధారంగా జరిగే జూదంలో ప్రధానంగా చేనేత కార్మికులు అధికంగా నష్టపోయి అప్పులు పాలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల్లో కూడా చీరాల ఆరితేరింది. ఇటీవల వరసుగా అంతర్జాతీయ క్రికెట్ పోటీల సందర్భంగా చీరాలలో బెట్టింగ్ జోరుగా సాగింది. విద్యార్థులే బెట్టింగ్‌లకు బలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఏడాదిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
మసకబారిన పోలీసు ప్రతిష్ట
గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసు ప్రతిష్ట మసకబారింది. సబ్ డివిజన్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారులు అవినీతి మరకలంటించుకున్నారు. బచ్చులవారిపాలెంలో జరిగిన ఓ హత్య కేసులో కేసు నమోదు చేయనందుకు ఓ ఎస్‌ఐ, సీఐ శాఖాపరమైన విచారణ ఎదుర్కొని చివరకు సస్పెండయ్యారు. సీఐ స్థాయి అధికారి వాడరేవులో పోలీసు అతిథి గృహం పేరుతో లక్షల రూపాయల నిధులు సేకరించి అభాసుపాలై సస్పెండయ్యాడు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలంటూ వ్యాపారులు, వైద్యశాలలు, కళాశాలల వద్ద భారీగా నిధులు సేకరించి అక్రమాలకు పాల్పడడంతో సీనియర్ సీఐ ఇటీవలే సస్పెండయ్యారు. కొత్తపేటలోని టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఓ మహిళను అర్ధరాత్రి స్టేషన్‌కు తీసుకొచ్చి ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె స్టేషన్çపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయంలో అక్కడ విధులు నిర్వర్తించే ఎస్‌ఐ, సీఐ సస్పెండ్‌కు గురయ్యారు.
నో రికవరీలు
ఇటీవల దొంగలు చీరాల ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసుస్టేషన్‌కు కూత వేటు దూరంలోని షాపులు, మద్యం దుకాణాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఓ బనియన్ దుకాణంలోకి అర్ధరాత్రి సమయంలో దూరిన దొంగలు విలువైన దుస్తులు, కొంత నగదు అపహరించారు. డీజీకె పార్కు సెంటర్లోని ఓ మద్యం దుకాణంలోకి అర్ధరాత్రి చొరబడిన దొంగలు విలువైన మద్యం బాటిళ్లతో పాటు రూ..50 వేలకు పైగా నగదు అపహరించారు. సాల్మన్ సెంటర్‌లో ఓ కిరాణా షాపు నిర్వహిస్తున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 20 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి, కొంత నగదు దోచుకెళ్లారు. ఇలాంటి ఎన్నో చోరీ కేసుల్లో పోలీసులు సవర బంగారాన్ని కూడా రికవరీ చేయలేకపోయారు.