
చీరాల టు కాశీ బై సైకిల్
భోగాపురం: ప్రకాశం జిల్లా కారంచే డు మండలం చీరాలకు చెందిన ఎంఈసీ విద్యాసాగర్ అనే వ్యక్తి సైకిల్‌పై కాశీయాత్రకు ఈనెల 6న బయల్దేరారు. ఆయన యాత్రలో భాగంగా జాతీయ రహదారిపై వెళ్తూ భోగాపురంలో విలేకరులకు బుధవారం కనిపించారు. ఈ సందర్భంగా ఆయనను వివరాలు అడగ్గా ఆధ్యాత్మిక చింతనతో ఈ యాత్ర చేపట్టానని తెలిపారు. ముందుగా కాశీకి వెళ్లి అనంతరం అక్కడినుంచి శబరిమలై చేరుకుని అక్కడినుంచి చీరాల చేరుకుంటానని తెలిపారు. తాను వెళ్తున్న దారిలో ఉన్న గ్రామాల్లో రాత్రి పూట బసచేసి గ్రామస్తులు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండేలా వారికి అవగాహన కల్పిస్తున్నానన్నారు. హింసను విడనాడి ఎదుటి వారికి సహాయ పడేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలనేదే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు.