ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: నగరానికి చెందిన చిట్‌ఫండ్ వ్యాపారులైన షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్‌బేగం దంపతులు 64.70లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారు. మొత్తం ఎనిమిదిమంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదటి ఇద్దరు ప్రతివాదులైన కాంతాలి శ్రీనివాసరావు-పద్మ దంపతులకు 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సుందని పేర్కొన్నారు. పిటిషన్‌లో తెలిపిన ప్రకారం..
షేక్ అబ్దుల్ రషీద్-షేక్ రషీద్‌బేగం దంపతులు ఖమ్మంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేవారు. వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. చిట్టీలు పాడుకున్న వారు డబ్బును వాయిదాల ప్రకారం చెల్లించకపోవడంతో వ్యాపారంలో నష్టపోయారు. అప్పులు తీర్చలేక, ప్రతివాదుల ఒత్తిళ్లు తట్టుకోలేక దివాళ పిటిషన్ దాఖలు చేస్తున్నట్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌దారుల తరఫున న్యాయవాదులుగా తాళ్ళూరి దిలీప్, రావుల వెంకట్ వ్యవహరిస్తున్నారు.
రూ.7.3లక్షలకు మరో వ్యాపారి...
రఘునాధపాలెం మండలంలోని రుద్రంకోట గ్రామానికి చెందిన పసుపులేటి అప్పారావు 7.03లక్షల రూపాయలకు ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంగళవారం దివాలా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 12మంది రుణదాతలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిటిషన్‌లో తెలిపిన ప్రకారం.. పిటిషన్‌దారుడైన పసుపులేటి అప్పారావు ఖమ్మం చుట్టుపక్కల గేదెల వ్యాపారం నిర్వహించేవాడు. ఇందుకోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చాడు. ఆ తరువాత గేదెలు చనిపోవడం, వ్యాపారంలో ఒడుదుడుకులు వచ్చాయి. దీంతో అప్పులు తీర్చలేకపోయాడు. ప్రతివాదుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమవడంతో తనను దివాలా తీసినట్టుగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ దివాలా పిటిషన్ దాఖ లు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాదుదిగా కన్నెబోయిన నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.
రూ.64.70 లక్షలకు ఐపీ
Published Wed, Oct 9 2013 4:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement