ఎంపీ ఇంజనీర్ రషీద్
శ్రీనగర్: ‘జమ్మూకశ్మీర్ ప్రజలు శాంతిని ఆకాంక్షిస్తున్నారు. అదీ వారి అభీష్టం ప్రకారమే. కేంద్రం ఆంక్షలకు లోబడి మాత్రం కాదు’ అని ఆవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, లోక్‌సభ ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ స్పష్టం చేశారు. ఉగ్ర నిధుల కేసులో తిహార్ జైల్లో ఉన్న ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో విడుదలైన విషయం తెలిసిందే.
గురువారం ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీనగర్ చేరుకున్న ఎంపీ రషీద్.. విమానాశ్రయంలో కాలు మోపిన వెంటనే మోకాళ్లపై వంగి నుదుటితో నేలను తాకి, బయటకు వచ్చారు. తన కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ‘మా కంటే వేరెవరికీ కశ్మీర్‌లో శాంతితో అవసరం లేదని ప్రధాని మోదీకి చెప్పదల్చుకున్నా. అయితే, మేం పెట్టే షరతులకు లోబడే శాంతి నెలకొనాలి తప్ప కేంద్రం విధించే ఆంక్షలకు లోబడి కాదు.
మాక్కావాల్సింది గౌరవంతో కూడిన శాంతి ఒక్కటే. శ్మశాన నిశ్శబ్దంతో కూడిన శాంతి కాదు’ అని అన్నారు. ‘సత్యం మాతోనే ఉంది. నరేంద్ర మోదీ, అమిత్ షా.. ఎవరైనా కానీ మా గొంతు నొక్కలేరు. మేం యాచించడం లేదు. మనుషుల్లా చూడండని కోరుతున్నాం. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుతూ మోదీ ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న తీసుకున్న నిర్ణయాన్ని మేం ఒప్పుకోం. ఇంజనీర్ రషీద్‌ను తిహార్ జైలుకు పంపినా, మరెక్కడికి పంపినా విజయం మాదే’ అని చెప్పారు.
ఇండియా కూటమికి మద్దతిస్తాం..అయితే
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి తాము మద్దతిస్తామని రషీద్ చెప్పారు. అయితే, ఇండియా కూటమికేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని ముందుగా హామీ ఇవ్వాలన్నారు. అలాంటి హామీ ఇస్తే మా కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఆ కూటమి అభ్యర్థులకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేస్తారన్నారు. భారత్ ప్రపంచ శక్తిగా ఎదగాలన్న కల నెరవేరాలంటే ముందుగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించాలని సూచించారు.‘మేం భారత్ శత్రువులం కాదు, అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రులమూ కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఆర్టికల్ 370ని సాధించుకోవాలనే వారు ఇళ్లలో కూర్చుని ప్రకటనలిస్తే చాలదు. లాల్‌చౌక్‌లో నిరసనలు చేపట్టి, లాఠీచార్జీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలు ఆ పని చేయలేదు’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment