స్వచ్ఛమేవ జయతే! | Chittoor 10th Rank in Swachh Bharath List | Sakshi
Sakshi News home page

స్వచ్ఛమేవ జయతే!

Published Thu, Mar 7 2019 1:10 PM | Last Updated on Thu, Mar 7 2019 1:10 PM

Chittoor 10th Rank in Swachh Bharath List - Sakshi

ఢిల్లీ ఆంధ్రాభవన్‌లో అధికారులతో కలసి అవార్డులు చూపుతున్న తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ విజయ్‌రామరాజు

మహా నగరాలతో పోటీపడిన తిరుపతి నగరం గట్టి పోటీ ఇచ్చి జాతీయస్థాయిలో పరపతిని మరోసారి చాటుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తిరుపతి నగరం గత ఏడాది జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ ర్యాంక్‌తో పోల్చి చూస్తే రెండడుగులు వెనక్కి వెళ్లినా జాతీయ స్థాయిలో మరింతగా మెరిసిందనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ వంటి పెద్ద నగరాలు ఈసారి టాప్‌–10లో చోటు దక్కించుకోలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్‌–10 జాతీయ ర్యాంక్‌ల్లో 8వ ర్యాంక్‌తో తిరుపతి నగరం ఒక్కటే  సత్తా చాటుకుంది.

చిత్తూరు, తిరుపతి తుడా: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పోటీల్లో తిరుపతి నగరం మరోసారి తన సత్తా చాటింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఈసారి పోటీలను గత రెండేళ్లతో పోలిస్తే మరింత కఠినతరం చేసింది. దీంతో ఆయా నగరాల ర్యాంకులపై ప్రభావం పడింది. అయితే నగరాల సామర్థ్యం మేరకు కచ్చితమైన ర్యాంకులు వచ్చాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ వేదికగా బుధవారం కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ వి.విజయ్‌రామరాజు ఈ అవార్డును అందుకున్నారు. 2017లో తొమ్మిదో ర్యాంక్, 2018లో ఆరో ర్యాంక్‌లో ఉన్న తిరుపతి ఈ సారి 8వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. స్వచ్ఛ పోటీల్లో తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ టాప్‌ టన్‌లో నిలిచి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. గత ఏడాది తిరుపతి నగరం కన్నా మెరుగైన ర్యాంక్‌తో ముందున్న విశాఖపట్నం–3, విజయవాడ–5 నగరాలు ఈసారి దరిదాపుల్లో నిలవలేకపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి నగరం మొదటి ర్యాంక్‌ కాగా, సౌత్‌ జోన్‌ లెవల్‌లో రెండో ర్యాంక్‌గా పరిగణించారు. మైసూ ర్‌ 3వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. జాతీయ స్థాయిలో మొదటి మూడు ర్యాంకులను ఇండోర్, అంబికాపూర్, మైసూర్‌ సొంతం చేసుకున్నాయి.

రాష్ట్రస్థాయిలో తిరుపతికి ఫస్ట్‌ ర్యాంక్‌
తిరుపతి నగరం రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. 5 వేల మార్కులకు పోటీలు నిర్వహించగా తిరుపతి నగరం 4,024.61 మార్కులను సాధించింది. గత ఏడాది 95 ర్యాంక్‌లో ఉన్న చిత్తూరు 2,794.64 మార్కులతో 112 ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మదనపల్లి పట్టణం 2,411.66 మార్కులతో జాతీయస్థాయిలో 181, రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంక్‌ను దక్కించుకుంది. గత ఏడాది 3వ ర్యాంక్‌లో ఉన్న విశాఖపట్నం ఈసారి 3,744.09 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 23,రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. గత ఏడాది 3580 మార్కులతో ఐదవ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విజయవాడ నగరం ఈసారి 3,882.46 మార్కుతో జాతీయ స్థాయిలో 12, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. మొత్తం మీద తిరుపతి స్వచ్ఛ కిరీటం దక్కించుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

త్రీ స్టార్‌ రేటింగ్‌
తిరుపతిని బిన్‌ ఫ్రీ (చెత్త కుండీలు లేని) నగరంగా ప్రకటించారు. ఈ నేపథ్యం తిరుపతి నగరంలో ఎక్కడా చెత్త కుండీలు లేకుండా చెత్త సేకరిస్తున్నారు. సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి 100 శాతం చెత్తను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరానికి 3 స్టార్‌ రేటింగ్‌ను కేంద్రం ప్రకటించింది. ప్లాస్టిక్‌ రహిత నగరంగా తిరుపతిని ప్రకటించుకుని ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేస్తున్నందున త్రీ స్టార్‌ నగరంగా ఎంపిక చేశారు.

బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటీజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌
తిరుపతి సీనియర్‌ సిటీజన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ కేటగిరిలో బెస్ట్‌ నగరంగా నిలిచింది. ఈ మేరకు బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటీజన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ కేటగిరిలో తిరుపతి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. క్షేత్ర స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ బృందం పర్యటించి కార్పొరేషన్‌ ద్వారా అందుతున్న సర్వీసు, సేవల ఆధారంగా సిటీజన్స్‌ అభిప్రాయాన్ని సేకరించారు. 1,250 మార్కులను సంబంధించి అభిప్రాయాన్ని సేకరించగా 1,105.61 మార్కులు సాధించింది. ఈమేరకు తిరుపతి నగరానికి బెస్ట్‌ సిటీ ఇన్‌ సిటీజన్స్‌ ఫీడ్‌ బ్యాక్‌ అవార్డు దక్కింది. సెక్రటరీ మనోహర్, మున్సిపల్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్, ఆర్వో సేతుమాధవ్‌ శానిటరీ సూపర్‌వైజర్లు గోవర్ధన్, చెంచయ్య రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు.

అభినందనలు
జాతీయ స్థాయిలో తిరుపతి నగరం 8వ ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం సంతోషకరం. ఇందుకు సహకరించిన నగర వాసులు, స్వచ్ఛత పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసిన కమిషనర్, ఇతర అధికారులు, కార్మికులకు అభినందనలు. ఇది తిరుపతి ప్రజల విజయం. జాతీయ స్థాయిలో మరోసారి తిరుపతి నగరం తన పరపతిని పెంచుకుంది. మహా నగరాలు గట్టి పోటీ ఇచ్చినా తిరుపతి మంచి ర్యాంక్‌ను సాధించింది. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులుగా మారడం నగర అభివృద్ధికి మేలు చేయనుంది.    – పీఎస్‌. ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్‌

తిరుపతి ప్రజల విజయం
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దేశవ్యాప్తంగా మెరుగైన ర్యాంకు రావడం వెనుక నగరవాసుల సంపూర్ణ సహకారం ఎంతో ఉంది. ప్లాస్టిక్‌ నిషేధానికి, బిన్‌ రహితంగా మార్చడం, చెత్తపై సమరం ఇలా ఏ ప్రయోగం చేస్తున్నా నగర వాసులు సహకారం మరువ లేనిది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో తిరుపతి జాతీయ స్థాయిలో 8, రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవడం నగర ప్రజలకు గర్వకార ణం. ప్రజలు, వ్యాపారులు అందరి సహకారంతోనే ఈ అవా ర్డు దక్కింది. అందరం మరింత బాధ్యతగా వ్యవహరిద్దాం.      –వి. విజయ్‌రామరాజు, కమిషనర్,        తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement