జగన్‌ అంకుల్‌.. అమ్మకు సాయం చేయరూ! | Chittoor Boy Urges Help For Mother Cancer Treatment | Sakshi
Sakshi News home page

అమ్మకు ప్రేమతో..

Published Fri, Dec 13 2019 8:55 AM | Last Updated on Fri, Dec 13 2019 8:55 AM

Chittoor Boy Urges Help For Mother Cancer Treatment - Sakshi

తల్లికి సపర్యలు చేస్తున్న కుమారుడు పవన్‌ కుమార్‌

పలమనేరు (చిత్తూరు జిల్లా) : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అర్ధంతరంగా వదిలేశాడు.. అప్పటికి ఆమెకు పదినెలల కొడుకు.. బతుకు బండి లాగేందుకు పనులకు వెళ్లేది.. పిల్లాడు ఐదో క్లాస్‌కు వచ్చాడు.. ఇంతలో ‘భయంకరమైన’ నిజం క్యాన్సర్‌ రూపంలో ఆవహించింది.. కళ్లెదుటే రోజురోజుకీ క్షీణిస్తున్న తల్లికి అన్ని సపర్యలు చేస్తూ ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మూగగా రోదిస్తున్నాడు. చుట్టుపక్కల వారు చేస్తున్న చిన్నాచితకా  సాయం ఏ మూలకూ చాలడంలేదు.. లేవలేకపోతున్న అమ్మను చూసి ఆ పసి హృదయం తల్లడిల్లుతోంది.. ఆమెను ఆదుకోవాలంటూ సమాజాన్ని అర్థిస్తోంది.. ముఖ్యమంత్రినీ వేడుకుంటోంది. అందరినీ కదిలిస్తున్న ఈ ఉదంతం వివరాలివీ.. చిత్తూరు జిల్లా పలమనేరు ఏడో వార్డులోని అంకిశెట్టి వీధికి చెందిన టీకొట్టు నిర్వాహకులైన లేట్‌ ఎత్తిరాజులు, విశాలాక్షిల ఏకైక కుమార్తె సుమతి (38). విశాఖపట్నం నుంచి బతుకుతెరువు కోసం ఇక్కడకొచ్చిన శ్రీనివాసులు అనే వంటమాస్టర్‌ సుమతిని 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పవన్‌కుమార్‌ అనే కొడుకు çపుట్టాడు. బిడ్డకు పది నెలల వయసుండగానే తాగుడుకు భార్య డబ్బులివ్వలేదని ఆమెపై దాడిచేసి వెళ్లిపోయాడు. అంతే.. అప్పటి నుంచి శ్రీనివాసులు పత్తాలేకుండా పోయాడు. దీంతో సుమతి హోటళ్లు, ఇళ్లల్లో పనిచేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది.

ఇంతలో.. కంబళించిన క్యాన్సర్‌.. 
మూడేళ్ళక్రితం ఆమె ఆనారోగ్యంతో ఆస్పత్రికెళ్తే సుగర్‌ ఉందని తేలింది. ఆ తర్వాత ఏడాది క్రితం కడుపులో గడ్డలు రావడంతో వైద్యులు క్యాన్సర్‌గా తేల్చారు. చికిత్స చేయించుకునేందుకు స్థోమత లేకపోవడంతో సుమతి ఇంటికే పరిమితమైంది. దీంతో రోగం రోజురోజుకీ ముదిరిపోయింది. లేవలేని స్థితికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో బంధువులు పట్టించుకోకపోవడంతో అయిదో తరగతి చదువుతున్న కొడుకు పైనే తల్లి ఆలనాపాలన భారం పడింది. ఆమె కోసం బడి మానేశాడు. ఇంట్లోనే ఉండి అన్ని రకాల సపర్యలు దగ్గరుండి స్వయంగా చేస్తున్నాడు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ఆ గుడిసెలో రోజూ వీరు పడుతున్న కష్టాలు చూసి చుట్టుపక్కల వారు భోజనం అందిస్తున్నారు. దాతలకు చెప్పి ఎంతోకొంత సాయం ఇప్పిస్తున్నారు. కానీ, ఒంటరి మహిళ పింఛన్‌ కోసం ఆమె దరఖాస్తు పెట్టుకున్నా ఇంకా మంజూరు కాలేదు. కనీసం రేషన్‌ పొందుదామన్న ఆమె ఆశ కూడా ఆడియాశే అయింది. వేలిముద్రలు పడలేదనే కారణంతో కార్డు ఇన్‌యాక్టివ్‌ అయింది. ఆరోగ్యశ్రీ ద్వారా అయినా చికిత్స పొందాలనుకుంటున్నట్లు ఆమె చెబుతోంది. ఇవేవీ అర్థకాక రోజూ తల్లడిల్లుతున్న ఆ పసి మనసు అమాయకంగా చూస్తున్న చూపులు అందరి గుండెల్నీ పిండేస్తున్నాయి. ఆస్తుల కోసం కన్నతల్లిని సైతం కడతేర్చే కొడుకులున్న నేటి సమాజంలో తన తల్లి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలని అంతచిన్న వయస్సులో ఆ బాలుడు పడుతున్న తాపత్రయం చూస్తే ఎవరికైనా కన్నీరొస్తుంది. 

జగన్‌ అంకుల్‌.. అమ్మకు సాయం చేయరూ! 
నేను ఐదో తరగతికి గండికోట స్కూల్‌కెళ్తుండేవాణ్ణి. మా అమ్మను చూసుకునేందుకు బడికి మానేసా. పైకి లేవలేని అమ్మకు అన్ని పనులూ నేనే చేస్తుంటా. జగన్‌ అంకుల్‌.. కనికరించి మా అమ్మకు వైద్యం చేయించరూ.. – పవన్‌కుమార్, సుమతి కుమారుడు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement