సాక్షి, నిజామాబాద్: బంగారం బిస్కట్ల దందాతో కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టిన ఘరానా మోసగాడు ఉంగరాల శ్రీనివాస్‌తో చేతులు కలిపినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీనివాస్‌రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఆయన మెదక్ జిల్లా తుప్రాన్ సీఐగా పనిచేసినప్పుడు ఈ ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన సీఐడీ.. సీఐ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేల్చారు. ఆయనను అరెస్టు చేయడానికి సీఐడీ అధికారులు బుధవారం పోచంపాడ్ కార్యాలయానికి రాగా.. ఇంటికి వెళ్లివస్తానని చెప్పి తప్పించుకుని పారిపోయాడు. ఈ విషయమై సీఐడీ అధికారులు గురువారం ఆర్మూర్ డీఎస్‌పీకి ఫిర్యాదు చేశారు. తమ కళ్లుగప్పి పరారైన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని నియమిం చినట్లు సమాచారం. రాష్ట్ర రాజధానిలో తలదాచుకునే అవకాశాలున్నాయని భావిస్తున్న సీఐడీ బృందం.. అక్కడికి వెళ్లి గాలిస్తున్నట్లు తెలిసింది.
సస్పెండ్ చేస్తారా?
సీఐడీ సీఐ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులూ కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఆయనపై మరోమారు సస్పెన్షన్ వేటు వేసే విషయంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ కేసు తమ స్థాయిలో లేదని పేర్కొంటున్నారు. ఈ కేసు విషయమై ప్రెస్‌తో చెప్పాల్సిన అంశాలేవీ లేవని ఆర్మూర్ డీఎస్‌పీ రాంరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. సదరు సీఐ సస్పెన్షన్ విషయమై తామెలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎస్‌పీ తరుణ్ జోషి తెలిపారు. కాగా శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఈ కేసుకు సంబంధమున్న పోలీసుశాఖలోని మరికొందరు అధికారులను కూడా సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేసి, ప్రశ్నించి తీగలాగితే డొంక కదిలే అవకాశాలున్నాయని సీఐడీ విభాగం భావిస్తున్నట్లు సమాచారం.
ఒక్కటొక్కటిగా..
శాంతిభద్రతలు పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో విశాఖ -షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను పోలీసులు తనిఖీ చేశా రు. మహరాష్ట్రకు తరలిస్తున్న 44 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిజామాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. ఎస్‌ఐ హన్మండ్లు, హెడ్‌కానిస్టేబుల్ సయ్యద్‌ఖాన్‌లు ఇందులోంచి 22 కిలోల గంజాయిని తీసి, ఓ స్మగ్లర్‌కు విక్రయించారు. ఈ వ్యవహారం ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ప్రత్యేక అధికారులు కేసు దర్యాప్తునకు ఆదేశించగా.. ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీరిని అరెస్టు చేశారు. తాజాగా ఆర్మూర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరి హత్య కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తాడ్వాయి ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయాలని కామారెడ్డి జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శుక్రవారం పోలీసులను ఆదేశించారు.
సీఐ కోసం సీఐడీ వేట
Published Sat, Jan 18 2014 5:48 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement
Advertisement