అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : మీ అందరి అభిమానం ఉంటే జీవితాంతం హాస్యాన్ని పంచాలనుందని ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం పేర్కొన్నారు. వీలైతే మరొకసారి అనంతపురానికి వచ్చి వీరబ్రహ్మేంద్రుల ఆశీస్సులందుకుంటానని అన్నారు. గురువారం సాయంత్రం అనంతపురంలోని రాణినగర్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సత్కార కార్యక్రమంలో అభిమానులు దూసుకురావడంతో ఆయన పైన పేర్కొన్న రెండే రెండు మాటలు మాట్లాడి వేదిక దిగి వెళ్లిపోయారు.
బ్రహ్మానందాన్ని చూడడానికి అభిమానులు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనికి తోడు నిత్యం రద్దీగా ఉండే రాణినగర్ రోడ్డుపై సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడంతో రసాభాసగా మారింది. ఆయనకు పలు సంస్థలు చేయాల్సిన సత్కారాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. పోలీసుల వలయంలో అతి కష్టం మీద స్టేజి వద్దకు చేరుకున్న బ్రహ్మానందం ముక్తసరిగా రెండే రెండు మాటలు మాట్లాడి ఊహించని విధంగా స్టేజీ దిగి వెళ్లిపోవడంతో అభిమానులతో పాటు నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోయారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం వెళ్లిపోవడంతో ఆగ్రవేశాలతో ఉన్న అభిమానులు కుర్చీలు విరగ్గొట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్నమే నగరానికి చేరుకున్న బ్రహ్మానందం స్థానిక ఆర్డీటీ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుని సాయంత్రం కార్యక్రమానికి హాజరయారు.
జీవితాంతం హాస్యాన్ని పంచుతా
Published Fri, Feb 7 2014 3:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement