అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ‘ఆడి పాడి అలసిపోయి అమ్మ ఒడిలో సేద తీరాల్సిన ముగ్గురు చిన్నారులు అగ్ని కీలలకు ఆహుతయ్యారు. కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చేపట్టిన చిరు వ్యాపారం వారి పాలిట మృత్యువుగా మారింది. ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ఈ సంఘటన ఇద్దరు తల్లులకు, ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పాతూరులోని రాణినగర్‌లో నివసించే వడ్డె బ్రహ్మయ్య, గంగమ్మ దంపతులకు ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి, సరస్వతి సంతానం.
వీరిలో పెద్ద వారిద్దరికీ వివాహాలయ్యాయి. పెద్ద అల్లుడు ఉపాధి నిమిత్తం వివిధ గ్రామాలకు పనులకు వెళుతుండడంతో అతని భార్య ముత్యాలమ్మ పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. చిత్తూరు జిల్లాలో నివాసముంటున్న రెండో కూతురు వెంకటలక్ష్మి ఒడి బియ్యం వేసుకోవడానికి పుట్టింటికి వచ్చింది. కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబ సభ్యులు లూజుగా పెట్రోలు విక్రయించేవారు.
ఇందులో భాగంగా మంగళవారం రాత్రి పది లీటర్ల పెట్రోలును కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేశారు. బుధవారం ఉదయం ముత్యాలమ్మ కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా, ఆమె కూతుళ్లు జ్యోతి (8), శ్యామ (5), పదకొండు నెలల మగ శిశువు, వెంకటలక్ష్మి కొడుకు నందకిశోర్(1) ఇంట్లో ఆడుకుంటుండగా, వెంకటలక్ష్మి, సరస్వతి ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆడుకుంటున్న పిల్లలు అరుగుపై ఉంచిన పెట్రోలు క్యాన్‌ను తగలడంతో, అది మండుతున్న పొయ్యిపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసి ఇంటిని ఆవరించాయి. దీంతో వారు చేసిన ఆర్తనాదాలు విన్న స్థానికులు వారిని రక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు. కొందరు యువకులు నీళ్లతో మంటలు ఆర్పి వేశారు.
గాయపడిన ముగ్గురు మహిళలు, నలుగురు పిల్లలను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 11 నెలల శిశువును స్థానిక పోలీసులు చొరవ తీసుకుని మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక హృదయ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలిస్తుండగా నందకిశోర్, జ్యోతి, శ్యామ మృతి చెందారు. కర్నూలులో చికిత్స పొందుతున్న ముత్యాలమ్మ, వెంకటలక్ష్మి.. అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11 నెలల చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.
ఐదుగురికి తప్పిన ప్రమాదం
బ్రహ్మయ్య కుటుంబంతోపాటు ఆయన సోదరుడి కుటుంబం కూడా అక్కడే నివాసముంటోంది. అందరూ కూలీలే కావడంతో ఎవరి పనుల కొద్దీ వారు ఉదయమే బయటకు వెళ్లడంతో బ్రహ్మయ్య, గంగమ్మ, అతని సోదరుడు రమణ కుటుంబ సభ్యులు మంజుల, సత్యమ్మ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఆస్పత్రి
అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న రాణినగర్ వాసులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారులను చూసి హృదయ విదారకంగా రోదించారు.
నేతలు, పోలీసు అధికారుల పరామర్శ
విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్‌సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, నేతలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, బోయ సుశీలమ్మ, లీగల్‌సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, డీఎస్పీ దయానందరెడ్డి తదితరులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్సలకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సిబ్బందికి సూచనలు చేశారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్‌ఓ
డీఎస్‌ఓ శాంతకుమారి, సివిల్ సప్లై విభాగం డిప్యూటీ తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీశారు. ప్రమాదం చోటుచేసుకున్న ఇంట్లో మరో పది లీటర్ల పెట్రోలు క్యాను లభించడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు చిన్నారుల మృతి
Published Thu, Oct 24 2013 2:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM