తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్ : సీఐటీయూ కార్మిక శక్తిగా ఎదుగుతోందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ.రాఘవులు పేర్కొన్నారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆదివారం సీఐటీయూ జిల్లా 5వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పీ.అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధ్యక్షులు పీ.చైతన్య, కార్యదర్శి కందారపు మురళి, ఉపాధ్యక్షులు కే.కుమార్‌రెడ్డి హాజరయ్యారు. బీవీ.రాఘవులు మాట్లాడుతూ సీఐటీయూ కార్మికుల పాలిట ఓ శక్తిగా మారిందన్నారు. కార్మికుల సమస్యలు పోరాటాలతోనే పరిష్కారమవుతాయని తెలిపారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ర్ట విభజనకు సహకరిస్తున్న కిరణ్, చంద్రబాబులను ఇక ప్రజలు నమ్మరని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. సీపీఎం మొదటి నుంచి సమైక్య నినాదంతోనే ముందుకెళుతోందని స్పష్టం చేశారు. టీటీడీ చిత్తూరు జిల్లాకు కనీస వసతులూ కల్పించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే కార్మికుడు కష్టాల్లో ఉన్నాడో అక్కడ సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. టీటీడీలో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులకు టైంస్కేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్ల సమస్యలపై అనేకసార్లు ఉద్యమాలు చేసి, విజయం సాధిం చినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
నగరంలో భారీ ర్యాలీ
సీఐటీయూ 5వ జిల్లా మహాసభలను పురస్కరించుకుని ఆదివారం సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ.రాఘవులతో పాటు ఆ సంఘం నాయకులు డప్పులు, వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టే షన్, కర్నాలవీధి, ఆర్‌సీ రోడ్డు, రేడియోస్టేషన్, ఎయిర్ బైపాస్‌మీదగా పీఎల్‌ఆర్ కన్వన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐటీయూ నాయకులు నాగరాజు, వాడ గంగరాజు, పురుషోత్తంరెడ్డి, టీటీడీ యూనియన్ నాయకులు వెంకటేష్, నాగార్జున, జానపద కళాకారుల నాయకుడు యాదగిరి, రుక్మిణి, వాణిశ్రీ పాల్గొన్నారు.
కార్మిక శక్తిగా సీఐటీయూ
Published Mon, Oct 28 2013 1:15 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement