నెల్లూరు (దర్గామిట్ట): నెల్లూరు నగరానికి ఆర్టీసీ సిటీ బస్సుల సదుపాయం కలగానే మిగిలిపోతోంది. దశబ్దాలుగా నగరంలో ప్రైవేటు బస్సు సర్వీసులే అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల సౌకర్యం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో ఆర్టీసీ సిటీ బస్సులు తిరుగుతున్నా.. నెల్లూరు నగరంలో ఆ సదుపాయం కల్పించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇందుకు ప్రైవేట్ సర్వీసుల యజమానులు అడ్డుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నగరాన్ని స్మార్ట్‌సిటీగా చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనైనా ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులోకి వస్తా యని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2012లో జవహర్‌లాల్ నెహ్రూ నావెల్ అర్బన్ రెన్యువల్ మిషన్(జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)లో భాగంగా పట్టణ పునర్నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి పట్టణంలో ఆర్టీసీ సిటీ బస్సులను నడపడం. మొదటి విడతగా గ్రేటర్‌గా ఉన్న హైదరాబాద్, వైజాగ్‌లకు సిటీ బస్సులను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
రెండో విడతగా విజయవాడ, తిరుపతి, వరంగల్ తదితర పట్టణాలకు బస్సులు కొని తిప్పాలని భావించారు. మూడో విడతలో గుంటూరు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి తదితర పట్టణాలకు బస్సులను పంపాలని ప్రతిపాదనలు తయారు చేశారు. మొదటి దశగా హైదరాబాద్, వైజాగ్ పట్టణాలకు కొత్తగా బస్సులను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. రెండో విడతలో ఆయా పట్టణాలకు బస్సులను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను అధికారులు మూలనపడేశారు. మూడో విడతకు సంబంధించి నెల్లూరు నుంచి జిల్లా అధికారులు ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించారు. ఏడాదిన్నర కావస్తున్నా ప్రతిపాదన దస్త్రాలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి.
నగరానికి 102 బస్సులకు ప్రతిపాదనలు
నెల్లూరు నగరంలో 102 సిటీ బస్సులు తిప్పేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. డిపో నుంచి నగర పరిధిలో ప్రతి 15 కిలోమీటర్లకు ఒక బస్సును తిప్పాలని అధికారులు నిర్ణయించారు. రాజుపాలెం నుంచి నెల్లూరు వరకు, బుచ్చి-ముత్తుకూరు, కొత్తూరు-కోవూరు, బుచ్చి-నెల్లూరుకు ఈ రీతిలో పలు గ్రామాల నుంచి పట్టణాన్ని అనుసంధానం చేస్తూ బస్సులు నడపాలన్నది అధికారుల ఉద్దేశం. ఈ మేరకు బస్సులను కూడా మంజూరు చూస్తూ ఏడాదిన్నర క్రితం ఆర్టీసీ అధికారులకు పత్రాలను పంపించారు. రెండో విడతలో ఆయా పట్టణాలకు పంపించాల్సిన బస్సులను ఇప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేయనేలేదు.
దీంతో మూడో విడత సంగతి మరిచిపోయారు. నెల్లూరుకు చెందిన ఆర్టీసీ అధికారులు మాత్రం మరో ఆరు నెలల్లో సిటీ బస్సులు వస్తాయని చెబుతున్నారు. రాష్ట్ర విభజన, ఆర్టీసీ నష్టాల బాటలో పయనించడం తదితర కారణాల నేపథ్యంలో సిటీ బస్సులు కొనుగోలు చేసి పంపాలన్న నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
విస్తరిస్తున్న నగరం : ఇప్పటికే నెల్లూరు నగర పరిధిని అధికారులు పెంచారు. నగర శివారులో కొన్ని గ్రామాలను నగరంలో విలీనం చేశారు. జిల్లా జనాభా 30 లక్షలకు పైగా ఉండగా, నెల్లూరు నగరంలో దాదాపు 7 లక్షల వరకు జనాభా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నగర పరిధిలో 100కు పైగా ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. వీటితో పాటు దాదాపు 8 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాలకు ఆటోవాలాలు ఇష్టం వచ్చినట్లు చార్జీలు వసూలు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో సిటీ బస్సులు తిప్పాలని ప్రజలు కోరుతున్నారు.
మరో ఆరు నెలల సమయం పడుతుంది
నెల్లూరుకు 102 సిటీ బస్సులు మంజూరయ్యాయి. బస్సులు రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు. ప్రతిపాదనలు పంపించి ఏడాదిన్నర అవుతోంది. ఇంకా రెండో విడతలో భాగంగా కొన్ని పట్టణాలకు బస్సులు పంపాల్సి ఉంది. మూడో విడతగా నగరానికి బస్సులు రావచ్చు.
- రవికుమార్, ఆర్‌ఎం, ఆర్టీసీ నెల్లూరు
ప్రతిపాదనలకే పరిమితం!
Published Sun, Sep 7 2014 2:49 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement