
ఒంగోలు కల నెరవేర్చండి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరానికి సిటీ బస్సుల వ్యవస్థను పరిపుష్టం చేయాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద తీసుకువస్తున్న బస్సులపై మాట్లాడుతూ ఈ పథకం కింద 162 కోట్లతో బస్సులు తీసుకువస్తే జిల్లాకు ఒక్క బస్సు కూడా కేటాయించకపోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ పథకం ఇప్పటికే పూర్తయిందని, ఈ దశలో జిల్లాకు తీసుకువస్తామని చెబుతున్న 40 బస్సులు ఎలా వస్తాయని మంత్రిని నిలదీశారు.
ఒంగోలు నగరానికి చిరకాల వాంఛయిన సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించినా మొక్కుబడిగా ఐదు బస్సులను మాత్రమే కేటాయించడంతో అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మద్దిపాడు, నాగులుప్పలపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, టంగుటూరు, కొత్తపట్నం, కొండపి, సింగరాయకొండ వంటి 12 మండల కేంద్రాలున్నాయన్నారు. వీటికి సిటీ బస్సులను ఏర్పాటు చేయాలని సురేష్ డిమాండ్ చేశారు.
పల్లెవెలుగులో ఐదు కిలోమీటర్లకు మినిమం ఛార్జి ఉంటే సిటీ సర్వీసుల్లో రెండు కిలోమీటర్లకే మినిమం ఛార్జి వసూలు చేస్తున్నారని, అందువల్ల ఆక్యుపెన్సీ రేషియో కూడా తగ్గుతోందని వివరించారు. ఒంగోలులో మూడు వేల ఆటోలుంటే, బయట నుంచి మరో మూడు వేలు వస్తున్నాయని, ఇందులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు.
భద్రతపై దృష్టి పెట్టండి : గొట్టిపాటి రవికుమార్
ఆర్టీసీలో భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. 400 కిలోమీటర్ల ప్రయాణం చేసే బస్సుల్లో కూడా డబుల్ డ్రైవర్‌ను ఏర్పాటు చేయని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. డ్రైవర్లకే టిమ్స్ ఇవ్వడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగిపోతోందన్నారు. ఒంగోలు డిపోకు చెందిన శ్రీను అనే డ్రైవర్‌కు విశ్రాంతి ఇవ్వకుండా బలవంతంగా మరో డ్యూటీకి పంపించడం వల్ల ఒత్తిడితో హార్ట్ ఎటాక్‌కు గురై అతను చనిపోయాడని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టీసీ ప్రయాణం శుభప్రదం అని చెబుతున్నా కనీసం ఎగ్జిట్ డోర్స్ కూడా పెట్టకుండా అక్కడ సీట్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
మా జిల్లా నుంచి వచ్చిన మంత్రిగారు మాకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు తీసుకువస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, అనంతపురంకు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం బస్సులు వచ్చాయని, ప్రకాశం జిల్లాకు మాత్రం రాలేదన్నారు. దీనిపై మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సిటీ బస్సులను పెంచుతామని, త్వరలో మినీ బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు రావాల్సిన అన్ని బస్సులను త్వరలోనే వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని సభ ద్వారా హామీ ఇచ్చారు.