ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న గొట్టిపాటి రవి, తదితరులు
రాళ్ల దాడిలో రవికుమార్ కారు పూర్తిగా ధ్వంసం
రవి అనుచరుడికి తీవ్రగాయాలు
కలెక్టరేట్ ఎదుట బైఠాయింపు
పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కలెక్టరేట్ సాక్షిగా అద్దంకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై తెలుగుదేశం పార్టీకి చెందిన కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్, వారి అనుచరులు దాడికి దిగారు. ఈ దాడిలో రవి అనుచరుడు ఒకరు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఎమ్మెల్యే కారును టీడీపీ వర్గీయులు పూర్తిగా ధ్వంసం చేశారు. వారి దౌర్జన్యాలను, దాడులను నిరసిస్తూ గొట్టిపాటి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వివరాల్లోకి వెళ్తే..
గుండ్లకమ్మ రిజర్వాయర్ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు సంబంధిత సమస్యపై ఇటీవలి జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నిలదీశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్వాసితుల అంశంపై చర్చించేందుకు కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. రవాణా శాఖా మంత్రి శిద్ధా రాఘవరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎంపీ కరణం బలరామ్, ఆయన కుమారుడు కరణం వెంకటేష్ కూడా తమ అనుచరులతో సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం పూర్తయి బయటకు వచ్చే సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటిని వెళ్లనీయకుండా కరణం వర్గీయులు అడ్డుగా నిలబడ్డారు.
గన్‌మెన్ వారిని తప్పుకోమని కోరగా అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈలోగా అక్కడికి వచ్చిన కరణం బలరామ్, ఆయన కుమారుడు వెంకటేష్‌లు అనుచరులను రెచ్చగొట్టడంతో వారు రాళ్లతో దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు తమ వాహనాలను అడ్డంపెట్టి దాన్ని ధ్వంసం చేశారు. డ్రైవర్, గన్‌మెన్, పీఏలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఎమ్మెల్యేపై దాడిని అక్కడున్న రైతులు అడ్డుకున్నారు. దాడి తర్వాత కరణం వర్గీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ దాడిని నిరసిస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి కలెక్టరేట్ ముందు నిరసనకు దిగారు. రవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి, దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోన్‌లో రవిని పరామర్శించారు.
నన్ను చంపడమే లక్ష్యంగా దాడి...
తనను అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. రెండు నెలల కాలంలోనే తనపై మూడుసార్లు దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు.గతంలో తన అన్న గొట్టిపాటి కిశోర్‌ను హత్య చేశారని, ఇప్పుడు వరుసగా మూడుసార్లు తాను గెలవడంతో తనను అంతం చేసేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విర్రవీగుతున్నారని అన్నారు. ఏఎస్‌పీ రామానాయక్, డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఎమ్మెల్యేతో చర్చలు జరిపారు. ‘మీరే దగ్గరుండి చంపిస్తారా..?’ అంటూ ఈ సందర్భంగా రవికుమార్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పర్చూరు ఇన్‌చార్జి గొట్టిపాటి భరత్ సహా పలువురు నేతలు బైఠాయింపులో పాల్గొన్నారు.
కరణం బలరామ్, వెంకటేష్‌లపై కేసు నమోదు
గొట్టిపాటి రవికుమార్‌పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ కరణం బలరామకృష్ణమూర్తి, ఆయన తనయుడు కరణం వెంకటేష్‌లతో పాటు మరో 23 మందిపై ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో గాయపడిన మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మందపాటి సురేష్ ఫిర్యాదు మేరకు సెక్షన్ 147, 324, 427, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.