పర్చూరు సభలో మాట్లాడుతున్న షర్మిల
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర శనివారం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాలల్లో జరిగింది. బహిరంగ సభలు, రోడ్‌షోల్లో వేలాది మంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మహానేత వైఎస్సార్ తనయకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జనభేరి యాత్ర జిల్లాలో మూడోరోజు శనివారం అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో సాగింది. గుంటూరు జిల్లా నుంచి ఉదయం అద్దంకి చేరుకున్న షర్మిలకు సమన్వయకర్త గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. షర్మిల వెంట వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వేలాదిమందినుద్దేశించి ఆమె ప్రసంగించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు.
ఆయన మద్దతు వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ అద్దంకి అభివృద్ధి చెందాలన్నా..ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని పీడిస్తున్న మృగాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ పాలన ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి రాఘవరావు పార్టీలో చేరారు.
అద్దంకిలో సమావేశం ముగిసిన అనంతరం మార్గమధ్యంలో షర్మిల తనకోసం వేచి ఉన్న వికలాంగులను కలుసుకున్నారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటకు చేరుకున్నారు. తిరిగి సాయంత్రం పర్చూరు వచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తన పాలనలో జరిగినవి చెప్పకుండా వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను తాను చేపడతానని చెప్పుకుంటున్నాడని అన్నారు. పులిని చూసి నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా..నక్క నక్కే అవుతుంది కానీ పులికాదని అన్నారు.
ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అపూర్వస్పందన లభించింది. సభానంతరం జనభేరి యాత్ర చీరాల చేరుకుంది. మార్గమధ్యంలో కారంచేడులో షర్మిల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. రాత్రి 9 గంటలకు చీరాల చేరుకున్న ఆమె పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. తొలుత నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించే సత్తా ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు.
జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని పాలన రాష్ట్రంలో వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పాలేటి రామారావు, పార్టీ నాయకులు అవ్వారు ముసలయ్య, కన్నేటి వెంకటప్రసాద్, వరికూటి అమృతపాణి తదితరులు పాల్గొన్నారు. అభిమానుల కోలాహలంతో దారిపొడవునా ఆమెకు ఘన స్వాగతం లభించింది.