
నిందితులంతా ఎమ్మెల్యే అనుచరులే
► 14 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
►మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాల గాలింపు
►కత్తులు, కర్రలు, కారం డబ్బా, కారు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం
►వారంతా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులే
►వివరాలు వెల్లడించిన గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్
ఒంగోలు క్రైం : జిల్లాలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఈ నెల 19వ తేదీ జరిగిన జంట హత్యల కేసులో 14 మంది నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 19వ తేదీ రాత్రి వేమవరం గ్రామంలో జరిగిన దాడిలో గోరంట్ల అంజయ్య, వేగినేని రామకోటేశ్వరరావు హత్యకు గురవగా, వేగినేని ముత్యాలరావు, గోరంట్ల వెంకటేశ్వర్లు, వేగినేని వీరరాఘవులు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.
ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, వారంతా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అనుచరులే. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు మాలెంపాటి వెంకటేశ్వర్లు గతంలో 1989లో సాంబయ్య హత్య కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు గొట్టిపాటి మారుతీబాబు అలియాస్ మారుతీ, మాలెంపాటి లక్ష్మీనారాయణ అలియాస్ చిన్నోడు, గొట్టిపాటి వెంకటేశ్వర్లు అలియాస్ సొసైటీ, గొట్టిపాటి వీరాంజనేయులు, గొట్టిపాటి శివన్నారాయణ, గొట్టిపాటి బ్రహ్మయ్య, శాఖమూరి సీతయ్య, శాఖమూరి రంగారావు, శాఖమూరి కాంతారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, గొట్టిపాటి రమేష్, గురజాల రాంబాబు, గురజాల రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు.
వీరిలో 8 మంది నిందితులను అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో, మిగతా ఆరుగురిని చినకొత్తపల్లి వద్ద అరెస్టు చేశారు. దాడిలో నిందితులు ఉపయోగించిన కత్తులు, కర్రలు, కారంపొడి డబ్బా, దాడి అనంతరం నిందితులను తరలించేందుకు ఉపయోగించిన కారు, మూడు మోటారు సైకిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దాడులు, ప్రతిదాడులు వద్దు
గ్రామాల్లో కక్షల పేరుతో దాడులు, ప్రతిదాడులు వద్దని, కత్తులు, కటార్లను ఎవరూ ఆశ్రయించవద్దని ఐజీ సంజయ్ హితవు పలికారు. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు, మైన్స్ ఇలా ఏదో ఒక సాకుతో గ్రామాల్లో వైరాలు పెంచుకుని దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. బల్లికురవ మండలం వేమవరం జంట హత్యల కేసుకు సంబంధించి గతంలో శివాలయం, రామాలయం, గనుల విషయాల్లో చోటుచేసుకున్న ఘర్షణలే కారణంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
స్పీడ్‌బ్రేకర్ల సమస్య కూడా ఇందుకు కారణంగా అభివర్ణించారు. ఎవరినైనా అంతమొందించాలని పథకం వేసుకుంటే చివరకు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందేనని ఐజీ హెచ్చరించారు. రాజకీయ నాయకుల అండదండలున్నాయని బరితెగిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు. ఇప్పటికీ అద్దంకి నియోజకవర్గం పోలీసుల నిఘానేత్రంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
పోలీస్ సమాచార వ్యవస్థ ఫెయిల్
వేమవరం ఘటన సమాచారం పోలీస్ ఉన్నతాధికారులకు చేరడంలో పోలీస్ సమాచార వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయినట్లు ఐజీ చెప్పారు. బల్లికురవ ఎస్సై ప్రొబేషనరీ ఎస్సై కావడం వలన సమాచార సేకరణలో కొంత లోపం ఏర్పడిందన్నారు. కొత్తగా వచ్చిన ఎస్సైలు పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తేనే భవిష్యత్తులో బాగా రాణించగలరని పేర్కొన్నారు. అయితే ప్రొబేషనరీ ఎస్సై కావడంతో అతనిని మందలించటం జరిగిందని, అతడికి అనుభవజ్ఞులైన ఎస్సైలు, సీఐల వద్ద ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని ఐజీ తెలిపారు. అదే విధంగా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) నిఘా వ్యవస్థ కూడా ఈ విషయంలో సక్రమంగా పనిచేయలేదన్నారు. జిల్లావ్యాప్తంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని పేర్కొన్నారు.
పికెట్లు కొనసాగింపు : ఎస్పీ త్రివిక్రమవర్మ
బల్లికురవ మండలంతో పాటు అద్దంకి నియోజకవర్గంలో పోలీస్ పికెట్లను కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ పేర్కొన్నారు. విజయవాడ నుంచి వచ్చిన ఏపీఎస్‌పీ మూడు ప్లటూన్లతో ప్రత్యేక పోలీస్ బృందాలు నిత్యం పహారా కాస్తున్నాయని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు సంసిద్ధులై ఉన్నామని వివరించారు. అదే విధంగా ఏపీఎస్‌పీ ఆరో బెటాలియన్ నుంచి ప్రత్యేక పోలీసులను రప్పించి 8 పోలీస్ పికెట్లను వేమవరంతో పాటు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. డీఎస్పీలు, సీఐలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిరంతరం శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. దర్శి డీఎస్పీ వి.శ్రీరాంబాబు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయని వివరించారు.
నిష్పక్షపాతంగా దర్యాప్తు
వేమవరంలో దాడి జరిగిన అనంతరం హుటాహుటిన జిల్లా ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మ సంఘటన స్థలానికి చేరుకున్నారని ఐజీ సంజయ్ వివరించారు. ప్రాథమిక సమాచారం మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులుగా 15 మందితో పాటు మరికొందరిని పేర్కొన్నట్లు చెప్పారు. ఎస్పీ స్వయంగా దర్యాప్తు చేపట్టడం వల్ల బాధితుల నుంచి కూడా సక్రమమైన సమాచారం వచ్చిందన్నారు. కేసు దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పారు.
అయితే, తొలుత ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ముగ్గురికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని దర్యాప్తులో గుర్తించి వారి పేర్లను తొలిగించినట్లు ఐజీ తెలిపారు. పేర్లు తొలిగించిన వారిలో మాలెంపాటి అనిల్, మాలెంపాటి నరేష్, గొట్టిపాటి శ్రీను ఉన్నారన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎఫ్‌ఐఆర్‌లో లేని మరో నలుగురికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించి ప్రస్తుతం వారిని కూడా అరెస్టు చేశామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిలో ఒకరు నిందితులను తరలించేందుకు సహకరించిన తేళ్ల రాజేష్ కాగా, మరొకరు దాడిలో పాల్గొన్న గొట్టిపాటి నాగయ్య అని, వారిద్దరినీ అరెస్టు చేయాల్సి ఉందని ఐజీ వివరించారు.