పార్టీ ఉనికి కోసమే పొత్తు
బీజేపీతో కొనసాగడంపై విశాఖ మహానాడులో సీఎం చంద్రబాబు వెల్లడి
(విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) తెలుగు రాష్ట్రాలలో పార్టీని కాపాడుకోవడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. పొత్తు వెనుక దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు. టీడీపీని రాజకీయ పార్టీలాగా కాకుండా ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో)లా నడుపుతున్నట్టు చెప్పారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని, మాట వినని నేతలపై వేటు వేస్తానని హెచ్చరించారు. విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు జరిగే టీడీపీ 36వ మహానాడులో శనివారం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలిలా ఉన్నాయి..
► తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవానికి ప్రతీక. నిరంతరం ప్రజల కోసమే పాటు పడుతుంది. అధికారంతో నిమిత్తం లేకుండా ఎన్జీవోలాగా పని చేస్తుంది.
► ఎన్టీఆర్ వ్యక్తి కాదు. వ్యవస్థ. బడుగు బలహీనవర్గాల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలి.
► ఈవేళ తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు–దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, బీమా, కోయిల్‌సాగర్ వంటివి నేనే చేపట్టా. ఆ తర్వాతి ప్రభుత్వాలు విస్మరించాయి.
► పద్ధతీ పాడూ లేకుండా విభజన జరిగింది. ఇందుకు కాంగ్రెస్ దోహదపడింది. ఎవ్వరికీ అన్యాయం జరక్కుండా చూడమన్నా. కానీ జరిగిపోయింది. ఇబ్బందులు వచ్చాయి.
పొత్తులపై ఇష్టానుసారం మాట్లాడొద్దు
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థలతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ విశాఖలో నిర్వహిస్తున్న మహానాడులో తొలిరోజు ఎనిమిది అంశాలపై తీర్మానాలు చేశారు. టీడీపీ మంత్రులు, ముఖ్య నేతలు వాటిని ప్రతిపాదించి బలపరిచారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం చంద్రబాబు... వచ్చే ఏడాదిలో సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. రాజకీయ పార్టీలతో పొత్తులపై ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు ఇష్టానుసారం మాట్లాడవద్దని, అగ్రనాయకత్వం మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటుందని కార్యకర్తలు, నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత ఆత్మహత్యలు పెరిగాయని, మీడియాపై ఆంక్షలు విధించి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టీడీపీ నాయకులు విమర్శించారు.
నందమూరి కుటుంబం దూరం
తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా పిలిచినప్పుడు ఆయన పేరు ప్రస్తావించినప్పటికీ తొలిరోజు మహానాడుకు రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తొలిరోజు వేదికపై కనిపించలేదు. వీరే కాదు నందమూరి కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ మహానాడు ప్రాంగణంలో కన్పించకపోవడం చర్చనీయాంశమైంది.