చంద్రబాబు బొమ్మతో ఉన్న కారు
► కేంద్ర నిధులతో ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు బొమ్మ
► ఆ బొమ్మను తొలగించిన లబ్ధిదారుల నుంచి కార్లు స్వాధీనం
► ఎస్సీ కార్పొరేషన్‌లో వింతపోకడ
సాక్షి, అమరావతి బ్యూరో: సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా టీడీపీ ప్రభుత్వ వ్యవహారం ఉందనే విషయం మరోసారి వెల్లడైంది. దళిత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్న వాహనాలపై సీఎం చంద్రబాబు బొమ్మ వేసి పంపిణీ చేస్తున్నారు. దళిత యువకులకు ఉపాధి చూపేందుకు కేంద్ర నిధులతో కార్లు పంపిణీ చేస్తుండగా ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంఇచ్చిన నిధులపై వీరి రుబాబు ఏమిటో అర్థం కావడం లేదంటూ పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. చంద్రబాబుపై స్వామి భక్తిని చాటుకునేందుకే జూపూడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని దళిత యువత మండిపడుతోంది.
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం ద్వారా ఏటా దళిత సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆ పథకం ద్వారా గత ఏడాది రూ.120 కోట్లు కేటాయించగా... అందులో కొంత వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా దళిత యువతకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కార్లను పంపిణీ చేశారు. వాటిపై సీఎం చంద్రబాబు బొమ్మను అంటించడంతో బాడుగకు తీసుకునేందుకు కొందరు ఇష్టపడక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు సీఎం బొమ్మను తొలగించారు. దీనిని పెద్ద నేరంగా జూపూడి భావిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో లబ్ధిదారులతో సమావేశమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఇన్నోవా కార్లపై ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించిన 8 మంది లబ్ధిదారులపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు బొమ్మ ఉంచుకోవాలని, అది గర్వకారణమని పేర్కొన్నారు. ఆ బొమ్మలేకుండా తిరిగే వాహనాలను స్వాధీనం చేసుకుని వేరొకరికి పంపిణీ చేయాలని నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. స్వామి భక్తిని చాటుకునేందుకు జూపూడి ఇలా వ్యవహరించారని దళిత యువత తప్పుపడుతోంది. కేంద్ర ని«ధులతో పంపిణీ చేసిన వాహనాలపై సీఎం బొమ్మ ఎలా అతికిస్తారని దళితులు ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఎంపీ తనయుడికి ఇన్నోవా ..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తనయుడు రాజేష్‌కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా వాహనం పంపిణీ చేశారు. దళితుల్లో పేదలకు కేటాయించాల్సిన వాహనాలను అడ్డదారుల్లో నేతలే దక్కించుకుంటున్నారనేందుకు ఇది నిదర్శనం. పేద దళిత యువకుతకు సవాలక్ష నిబంధనలు వినిపించే అధికారులు మాజీ ఎంపీ తనయుడికి కారు పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో కూడా టీడీపీ నేతలు వాటాలు పుచ్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.