విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చంద్రమౌళి
కుప్పం : ఏ రాష్ట్రంలోనూ ఇంత దౌర్భాగ్య ప్రభుత్వం తాను చూడలేదని, ప్రభుత్వంలో పనిచేసే చీఫ్ సెక్రటరీలే ప్రభుత్వ తీరుపై బహిరంగ ఆరోపణలు చేయడమే దీనికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చంద్రమౌళి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం చీఫ్ సెక్రటరీ అజయ్ కలాం బాహాటంగా ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారని తెలిపారు. కుప్పం అభివృద్ధిపై గతంలో రెండు సార్లు చంద్రబాబుకు లేఖలు రాశామని, అవి ఆయనకు చేరిందో లేదో తెలియదు కానీ, ఈసారి ప్రజల సమక్షంలో బహిరంగంగా సీఎం నియోజకవర్గ అభివృద్ధిపై లేఖ రాస్తానని తెలిపారు. ఏ నియోజకవర్గంలో లేని సంస్కృతి కుప్పంలో చోటుచేసుకుందని విమర్శించారు.
హెచ్చుమీరుతున్న ఆగడాలు...
‘డీకేటీ భూములు, పట్టాలు, ప్రభుత్వ కార్యాలయల్లో ఏ పార్టీకి చెందినవారో తెలుసుకుని పనులు చేస్తారా..? దేవాలయ భూములను ఆక్రమించుకుని భవనాలు నిర్మిస్తారా..? మార్కెట్ యార్డు నిర్మాణంలో భూ వివాదంపై ప్రభుత్వ స్పందన ఏది..? అధికార పార్టీ వ్యక్తులు కాకపోతే వారిపై తప్పుడు కేసులు విధిస్తారా..? ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న తతంగ’మన్నారు. ఇక్కడ పనిచేస్తున్న వారిని ఎవర్నీ వదిలి పెట్టేది లేదన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్యకైనా పరిష్కారం దొరకడం లేదని, ప్రతి విషయానికి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రం అష్టకష్టాల్లో ఉంటే బాబు సింగపూర్ టూర్ వెళ్లడం అవసరమా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, బెంగళూరు నుంచి సింగపూర్‌కు అనేక విమానాలున్నా ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో వెళ్లడం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నట్లు డ్రామాలు సృష్టించి ఢిల్లీలో ఆయనకు కనపడకుండా దాగుడుమూతలు ఆడి తిరిగి రాలేదా? అని విమర్శించారు. వినుగొండ దగ్గర కియో కార్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా 40 వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తుందని, ఇలాంటి ఫ్యాక్టరీని కుప్పంలో ఎందుకు స్థాపించలేదని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మరుగుదొడ్లును కూడా కాంట్రాక్టర్లకు అమ్ముకుని అధికా ర పార్టీ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు. ఆయన వెంట రామకుప్పం, గుడుపల్లె కన్వీనర్లు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసమూర్తి, గోవింద, శరవణ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment