సాక్షి, అమరావతి: తొమ్మిది రోజుల పాటు మూడు ఖండాల్లోని మూడు దేశాల్లో ఉన్న ఏడు నగరాల్లో పర్యటించామని, కుదుర్చుకున్న ఎంఓయూల ద్వారా 10 బిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఆయన ఆ విశేషాలను తెలిపేందుకు శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో విదేశీ టూర్లంటే ఎక్కువగా ఐటీ కంపెనీలకు వెళ్లేవాడినని, ఈసారి వ్యవసాయ టెక్నాలజీపై దృష్టి పెట్టానని తెలిపారు.
రాబోయే రోజుల్లో రైతుల కళ్లల్లో దీపావళి చూసేందుకు అమెరికాలో దీపావళి రోజు వ్యవసాయ క్షేత్రాల్లో గడిపానన్నారు. రాష్ట్రంలో వ్యవసాయంలో విపరీతంగా ఎరువులు వాడుతున్నారని, దీనివల్ల అందరూ ఎరువుల్నే తింటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భారతదేశంలో ఎక్కువగా ఎరువుల్ని వినియోగించే రాష్ట్రాల్లో హర్యానా, ఆంధ్రప్రదేశ్‌లు ముందున్నాయని తెలిపారు. ఎరువుల వాడకం తగ్గించమని రైతులకు చెబుతున్నామన్నారు. ప్రపంచం అంతా ఆర్గానిక్ వ్యవసాయంపై ముందుకెళుతోందని దానిపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. గోల్డెన్ పీకాక్ అవార్డు తీసుకున్నానని, ఇలాంటి వాటి వల్ల మనలో నమ్మకం పెరుగుతుందని ఆయన చెప్పారు. విదేశాల్లో పర్యటనల సందర్భంగా తొమ్మిది రోజులు విమానంలోనే పడుకున్నానని, అందులోనే స్నానం చేశానని, అక్కడే ముఖం కడుక్కున్నానని చెప్పారు. కొన్నిరోజులైతే స్నానం కూడా లేకుండా తిరిగానని తెలిపారు.
స్తూపం డిజైన్‌కు తొలి ప్రాధాన్యం...
రెండు వేల ఏళ్ల నాటి వారసత్వాన్ని ప్రతిబింబించేలా నీటిలో ఉండే అసెంబ్లీ భవనం రెండు డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిందని సీఎం తెలిపారు. వాటిలో అమరావతి స్తూపం డిజైన్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆ మేరకు మార్పులు చేసి తీసుకురమ్మన్నామని చెప్పారు. హైకోర్టుకు స్తూపాకారం డిజైన్ అందంగా వచ్చిందని దాన్ని ఓకే చేశామన్నారు.
సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించే డిజైన్ ఇచ్చారని, అవి ఒకే వరుసలో నిర్మించాలా, లేక రెండు, మూడు వరుసల్లోనా అనే అంశంపై రెండు, మూడు ఆప్షన్లతో డిజైన్లు సిద్ధం చేసి చూపించాలని చెప్పానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 14 శాతం లెస్‌కు కాంట్రాక్టర్‌కి ఇచ్చారని, ఇప్పుడు అతను దాన్ని పూర్తి చేసే స్థితి లేదన్నారు. 60 సి కింద ప్రాజెక్టులోని కొన్ని పనులను విడిగా అవుట్‌సోర్సింగ్‌కి చేయించే అవకాశం ఉందని, చర్చిస్తున్నామని చెప్పారు. ఫాతిమా కళాశాల విద్యార్థులకు న్యాయం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఎరువులే తింటున్నాం!
Published Sun, Oct 29 2017 1:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment