
'చంద్రబాబు వల్లే అక్కచెల్లెమ్మల కళ్లల్లో కన్నీళ్లు'
ఉప ఎన్నికలు రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఒక్కసారైనా నంద్యాల వచ్చారా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు.
నంద్యాల : ఉప ఎన్నికలు రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఒక్కసారైనా నంద్యాల వచ్చారా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నేడు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టే వారికి నంద్యాల గుర్తొచ్చిందని, తండ్రికొడుకులు ఇద్దరు ఇప్పుడు నంద్యాల రోడ్లపై కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీని తట్టుకోలేక ఏపీ కేబినెట్ మొత్తం నంద్యాల్లో దిగిందని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఐదో రోజు నంద్యాల రోడ్‌షోలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి, అన్యాయాలను తూర్పారబట్టారు.
అందరినీ మోసం చేశారు
అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. బ్యాంకుల గడప తొక్కలేని స్థితిలో డ్వాక్రా మహిళలు ఉన్నారు. నేడు రాష్ట్రంలో మహిళల కళ్లల్లో కన్నీళ్లకు కారణం చంద్రబాబే. మూడున్నారేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు రాకుంటే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యార్థులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ప్రతి ఇంటికి నేడు రూ.76 వేలు బాకీ పడ్డారు. ఆఖరికి పేదవారిని కూడా ఆయన వదిలిపెట్టలేదు.
ఒక్క ఇళ్లయినా కట్టించారా..?
ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తానని అన్న చంద్రబాబు పేదవారికి ఒక్క ఇళ్లయినా ఇప్పటి వరకు కట్టించలేదు. అధికారం కోసం చంద్రబాబు ప్రజలను వాడుకుంటున్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదు. చంద్రబాబు తీరుతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కర్నూలు జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతును మోసం చేసేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన బాబు ఆ పనిచేయలేదు.
ఎన్నికలుంటేనే చంద్రబాబుకు గుర్తొస్తారు..
ఎన్నికలుంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలు గుర్తొస్తారు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే చంద్రబాబుకు మళ్లీ ప్రజలు గుర్తొచ్చారు. మరోసారి మోసం చేసేందుకు మళ్లీ టేపు రికార్డర్ ఆన్ చేశారు. ఎక్కడైనా రోడ్ల విస్తరణ జరుగుతుంది. అది అభివృద్ధి కాదు. ఎవరిని అడగకుండా షాపులను కూల్చేస్తారు.
నాకున్న ఆస్తి మీరే
చంద్రబాబులాగా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ది, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించే టీవీ చానెళ్లు పేపర్లు నా వద్ద లేవు. నాకున్న ఆస్తి నాన్నగారు ఇచ్చిన పెద్ద కుటుంబమే. వైఎస్‌ఆర్ సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో బతికుండటమే నాకున్న ఆస్తి. మీ జగన్ అబద్ధం ఆడడు. మోసం చేయడు. మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి.
నవరత్నాలతో వెలుగు నింపుతా
నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగు నింపుతాను. ఒక్క అవకాశం ఇస్తే నాన్న మాదిరిగా అందరి గుండెల్లో ముద్ర వేసుకుంటాను. బిల్డింగ్‌లు కూల్చేయడం, రోడ్లు తవ్వడం అభివృద్ది కాదు.. రైతుల, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన అభివృద్ధి. నంద్యాల ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను. నంద్యాల ప్రజలను నేను ఒక్కటే కోరుతున్నాను. ధర్మానికే ఓటెయ్యండి. న్యాయాన్ని గెలిపించండి. మీ ఓటుతో నేను వెంటనే ముఖ్యమంత్రిని కాకపోవచ్చు. కానీ, ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి నంద్యాల ఎన్నిక నాంది కావాలి.
లౌక్యంగా ఓటు వేయండి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బు మూటలతో మీ దగ్గరకు వస్తారు. ఈ మూడున్నరేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును తీసుకొస్తారు. రూ.5వేలు ఇచ్చి దేవుడి పటం చూపించి ప్రమాణం చేయించుకుంటారు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పడు.. అలా దెయ్యాలే చెబుతాయి. రూ.5వేలు మీ చేతుల్లో పెట్టినప్పుడు దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటెయ్యండి. ధర్మానికి ఓటెసి న్యాయాన్ని గెలిపించండి.