
మన అలుగును మనమే నిర్మించుకుందాం
జలం ఉంటే తప్ప రాయలసీమ కరువుకు పరిష్కారం దొరకదు..
► ‘మనరాయి.. మనసిద్ధేశ్వరం’ నినాదంతో కదులుదాం
► 10వేల మందితోపనులకు పూనుకుందాం
► రాయలసీమ జలసాధన కార్యాచరణ సదస్సులో నేతల పిలుపు
నంద్యాల రూరల్: ‘జలం ఉంటే తప్ప రాయలసీమ కరువుకు పరిష్కారం దొరకదు.. ఇందుకోసం మనకు మనమే కృష్ణానదిపై సిద్ధేశ్వరం అలుగును నిర్మించుకుందాం. ఇందుకోసం పల్లెలకు వెళ్లి ప్రజలను చైతన్యం చేద్దాం.. జూన్ 2వ వారంలో ‘మనరాయి-మన సిద్ధేశ్వరం’ నినాదంతో 10వేలమందితో తరలివెళ్లి అలుగు నిర్మాణ పనులు మొదలెడదాం’ అని రాయలసీమ జల సాధన కార్యాచరణ సదస్సులో నేతలు పిలుపునిచ్చారు. నంద్యాల త్రినేత్ర అట్ల ఫంక్షన్ హాలులో బుధవారం నిర్వహించిన సదస్సులో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జాదశరథరామిరెడ్డి, రాయలసీమ జేఏసీ కన్వీనర్ తరిమెల శరత్‌చంద్రారెడ్డి, రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ కన్వీనర్ భాస్కర్ జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
కరువు సీమలోని నీటి ప్రాజెక్టులు కోస్తా ప్రాంతానికి జలసంపదగా మారాయని,వీటి వల్లనే ప్రాంతీయ విభేదాలు పెరుగుతున్నాయన్నారు. రాయలసీమ వెనుకబాటుకు కారణాలను వెతికి పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటు రాజకీయాలతో పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. సీమప్రాంతవాసులు ఓట్లు వేయలేదనే సాకుతో ఈ ప్రాంత అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తుండడం బాధాకరమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బడ్జెట్‌లో కూడా అరకొర నిధులతో సరిపెట్టారన్నారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలకు అతీతంగా ఉద్యమం..
రాయలసీమ అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి చైతన్యం తెద్దామని నాయకులు పిలుపునిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా రైతులతో కలిసి ఐక్యంగా శాంతియుత ఉద్యమం చేపడదామన్నారు. సీమ ప్రాంతంలో తాగేందుకు గుక్కెడు నీరు కూడా లభించని పరిస్థితి ఉందన్నారు. ఉపాధి లేక ప్రజలు వలసబాట పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భావి తరాల సంక్షేమం కోసం ఉద్యమ బాట పట్టక తప్పదని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్ రాయలసీమ అభివృద్ధికి పాటుపడ్డారని, ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
రైతుల ఉద్యమానికి విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కుందూ పోరాట సమితి నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి, ైవె ఎన్‌రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకులు సోమసుందర్‌శర్మ, రాధాకృష్ణ, డాక్టర్ కృష్ణమూర్తి, బండి నారాయణస్వామి, విద్యార్థి సంఘం నాయకులు రవికుమార్, ఏపీ రైతు సంఘం డివిజన్ కార్యదర్శి పుల్లా నరసింహ, నంది రైతు సంఘాల నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.