మా వాళ్లు తొందరపడ్డారు: చంద్రబాబు
►రాజధాని డిజైన్లు ఇంకా ఖరారు కాలేదు
►నార్మన్ ఫోస్టర్స్ డిజైన్లలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది
►దర్శకుడు రాజమౌళిని డిజైన్ల కోసం రిక్వెస్ట్ చేస్తాం
సాక్షి, అమరావతి : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం ఆలస్యం అయినా రాజీపడేది లేదని, మంచి డిజైన్ల కోసం అందరి సలహా తీసుకుంటామని అన్నారు. తమ వాళ్లు తొందరపడి తేదీని ప్రకటించారని చంద్రబాబు అన్నారు. నార్మన్ ఫోస్టర్ డిజైన్లలో మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని డిజైన్ల కోరామని, గతంలో కూడా ఒకసారి ఆయనను అడిగామని చంద్రబాబు తెలిపారు. కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ఏమీ రాలేదని చెప్పారు. ఇప్పటివరకూ రూ.13వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉన్నా రాలేదని చంద్రబాబు తెలిపారు. రాజధాని కోసం అప్పులు తీసుకొచ్చి...భూములు విక్రయించి, వివిధ సంస్థల ద్వారా నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం చేపడతామని సీఎం పేర్కొన్నారు.
కాగా 2018 కల్లా మొదటి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో మాత్రం అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి దసరా పండుగ రోజున (ఈ నెల 30) శంకుస్థాపన చేస్తామన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ, హైకోర్టుతోపాటు సచివాలయ భవనానికి సంబంధించిన డిజైన్లను నార్మన్ ఫోస్టర్ సంస్థ ముఖ్యమంత్రికి చూపించినప్పటికీ వారిపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ నెల 30న శంకుస్థాపన లేకపోవడంతో రాజధాని నిర్మాణ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది.
డిజైన్ల కోసం మళ్లీ రాజమౌళిని సంప్రదించాలని ఏపీ సర్కార్ నిర్ణయం చర్చనీయాశంగా మారింది. అయితే గతంలో చంద్రబాబు ప్రతిపాదనను రాజమౌళి సున్నితంగా తిరస్కరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం మళ్లీ రాజమౌళి వద్దకే వెళ్లాలనుకుంటోంది.
ట్రాన్స్‌ట్రాయ్‌కు నోటీసులు ఇచ్చాం...
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ మార్పుపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ట్రాన్స్‌ట్రాయ్ పనులు సరిగా చేయడం లేదని, 60 (సి) నిబంధన ప్రకారం కంపెనీకి నోటీసులు ఇచ్చామన్నారు. వాళ్లు చేస్తున్న పనులను రద్దు చేసి వేరేవారికి అప్పగిస్తామని చెప్పారు. పనులు వేరేవారికి అప్పగించినా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని చెప్పుకొచ్చారు.