
చింతలపూడి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు, చింతలపూడి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటన పూర్తిగా నిర్బంధం నడుమ సాగింది. ప్రజలు, నాయకులు, రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తారనే భయంతో సోమవారం రాత్రి నుంచే రైతు నాయకులు, వామపక్ష నేతలతోపాటు వైఎస్సార్ సీపీ నేతలను
పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టారు. ముఖ్యమంత్రి చింతలపూడి రావడానికి కొద్దినిముషాల ముందు వైఎస్సార్ సీపీ చింతలపూడి సమన్వయకర్త వీఆర్ ఎలీజా, మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకీరెడ్డి, మండల నేత వెంకటేశ్వరరావు తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లడం వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా చింతలపూడి పర్యటన నేపథ్యంలోమంగళవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి రావడానికి ముందే వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తరలించారు.
ముఖ్యమంత్రిని కలిసి ఎక్కడ సమస్యలపై ప్రశ్నిస్తారోనన్న భయంతో నియోకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా, మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డితో పాటు మరికొంత మంది విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో బుధవారం జరిగే గురుపూజోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి ఇంటికి కాలినడకన వస్తున్న ఎలీజాను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్రమంగా పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్భంధిచిన వైఎస్సార్ సీపీ నేతలను విడిచి పెట్టాలని ఆందోళనకు దిగారు. దాంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నిలదీస్తారనే భయంతోనే..
ముఖ్యమంత్రి పర్యటన ముగిశాక సాయంత్రం ఐదున్నర గంటలకు అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఆసాంతం ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే రెండు వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రగా ఫైర్‌స్టేషన్ సెంటర్ చేరుకుని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ తీరుకు , పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కాలి నడకన కార్యకర్తలతో కలిసి మెయిన్‌రోడ్డును శుద్ది చేసుకుంటూ వైఎస్‌ఆర్ సిపి కార్యాలయానికి చేరుకున్నారు.
పలువురి గృహ నిర్భంధం
ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని మండలంలోని సీపీఐ, వైఎస్సార్ సీపీ నేతలతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతు సంఘం నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం. వసంతరావు, సీపీఐ మండల కార్యదర్శి కె.గురవయ్య, పట్టణ కార్యదర్శి టి.బాబు, యర్రగుంటపల్లి సీపీఐ నాయకులు పి. సోమశేఖర్, చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతు సంఘం నాయకులు అలవాల ఖాదర్‌బాబురెడ్డి, పి.ముత్తారెడ్డి, కాంగ్రెస్ పీసీసి కార్యదర్శి మారుమూడి థామస్ తదితరులను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు.
ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఖండన
ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయలేకపోగా, ప్రశ్నిస్తారన్న భయంతో ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడటం సరికాదని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చింతలపూడి పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతు నేతలను అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలకు పాల్పడటం సరికాదన్నారు. తమకు అన్యాయం జరిగిందని గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్న రైతుల సమస్యను పరిష్కరించాల్సిందిపోయి వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం కాదని ఆయన విమర్శించారు.
‘చింతలపూడి’ రైతులకు దక్కని హామీ
గత రెండేళ్లుగా తమకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించలేదు. ఒకే పథకంలో ఒక్కో చోట ఒక్కో రేటు ఇవ్వడం, తమకు అన్యాయం జరుగుతుందని పోరాడుతున్న రైతు కమిటీ నేతలను ముందస్తుగానే గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. బోయగూడెంలో ఒక రైతు ప్రశ్నించినప్పుడు కూడా ముఖ్యమంత్రి న్యాయం చేస్తామని హమీ ఇవ్వలేదు. బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత ఈ విషయాన్ని ప్రస్తావించినా ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు.
ఆయిల్‌పామ్ మద్దతు ధరపై స్పందనేదీ!
పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు మంచిధర దక్కుతుండగా, ఇక్కడ గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ విషయంపై ఎంపీ మాగంటి బాబు ప్రస్తావించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవసరమైతే మరో ఫ్యాక్టరీ పెడతామని, అప్పటి వరకూ రైతులతోనే ఇప్పుడున్న ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించినా, మద్దతు ధర ఎంత ఇప్పిస్తాననే మాట ముఖ్యమంత్రి నోట రాకపోవడంపై ఆయిల్‌పామ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment