కొరత లేకుండా.. ఇసుక | CM YS Jagan command for collectors and SPs at video conference | Sakshi
Sakshi News home page

కొరత లేకుండా.. ఇసుక

Published Wed, Jul 31 2019 3:19 AM | Last Updated on Wed, Jul 31 2019 10:05 AM

CM YS Jagan command for collectors and SPs at video conference - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఇసుక లభ్యతపై కలెక్టర్లను ఆరా తీసిన ముఖ్యమంత్రి సెప్టెంబర్‌ నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని, అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు అమర్చి పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. అవసరమైతే కొత్త ర్యాంపులు ప్రారంభించి ఇసుక లభ్యత పెంచాలని, అదే సమయంలో అవినీతికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తగినంత ఇసుక లభ్యత లేకుంటే వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ నేపథ్యంలో సమస్యపై కచ్చితంగా దృష్టి పెట్టాల్సిందేనని సీఎం పేర్కొన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అంకితభావంతో వ్యవహరిస్తున్నందువల్ల ప్రజల నుంచి స్పందన దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు.

తాము ఇచ్చిన అర్జీలు చెత్తబుట్ట పాలుకావడం లేదని, కలెక్టర్లు కచ్చితంగా పట్టించుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిం దన్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత చాలా ముఖ్యమని, కలెక్టర్లు ధ్యాస పెడితే తప్ప ఇది సాధ్యం కాదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం ఉద్యోగులు స్పందనలో పాల్గొంటున్నారా? లేదా? అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఎమ్మార్వో, ఎంపీడీవోలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు సమర్థులని గట్టిగా నమ్ముతున్నానన్నారు. 

అవినీతికి తావులేదు.. ప్రజలు సంతృప్తి చెందాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడా అవినీతికి తావులేకుండా చూడాలని, ప్రజలు సంతృప్తి చెందేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. అవినీతి కార్యకలాపాలను సహించబోమని ప్రతి సమీక్షా సమావేశంలో గట్టిగా చెప్పడమే కాకుండా ఎక్కడైనా అలాంటివి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తెచ్చుకోవద్దన్నారు. ·ఎమ్మార్వో కార్యాలయంలో అవినీతి జరిగితే కలెక్టర్‌కు, పోలీస్‌స్టేషన్‌లో జరిగితే ఎస్పీకి చెడ్డపేరు వస్తుందని, అందుకే ప్రతి సమీక్షలోనూ ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

స్పందన కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ సవాంగ్‌ తదితరులు. 

‘మధ్యాహ్న భోజనం’ బాధ్యత కలెక్టర్లదే
మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టిపెట్టాలని, పాత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకానికి సకాలంలో డబ్బులు ఇవ్వాలని లేదంటే ఆహార పదార్థాల నాణ్యత పడిపోతుందని హెచ్చరించారు. చెల్లింపులు  కచ్చితంగా సకాలంలో జరగాలని, దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెడుతుందని తెలిపారు. కోడి గుడ్లు నాసిరకంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. మధ్యాహ్న భోజన పథకం బాధ్యతను కలెక్టర్లకే అప్పగిస్తున్నామని, పైస్థాయిలో దీనిపై ఎలాంటి నిర్ణయాలు వద్దని సూచించారు.

దరఖాస్తు అందిన 72 గంటల్లోగా ఇవ్వాలి...
కొత్తగా ఏర్పాటయ్యే గ్రామ, వార్డు సచివాలయాల భవనాలకు గుర్తింపు తప్పనిసరని, వసతులు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సీఎం సూచించారు. అక్కడ కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్‌ సదుపాయం, స్కానర్, ప్రింటర్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలు దరఖాస్తు అందచేసిన 72 గంటల్లోగా రేషన్‌ కార్డు, పెన్షన్‌ ఇచ్చేవిధంగా అన్నీ సమకూర్చుకోవాలన్నారు. గ్రామ సచివాలయాలను ప్రారంభించిన తరువాత అర్హులకు కార్డులు జారీ చేసే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలా అయితేనే గ్రామ సచివాలయానికి ఒక అర్థం ఉంటుందని, అలాంటప్పుడే ప్రజల హృదయాల్లో నిలుస్తుందని చెప్పారు. ప్రతి కలెక్టర్‌ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూసుకోవాలని సీఎం సూచించారు. 
వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌   

వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి..
ప్రజలు సంతృప్తికరంగా ఉండాలని, సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు జరగాలని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కనీసం లక్ష మంది పరీక్షలకు హాజరు కానున్నారని, ఇంతమంది రాయడం ఎప్పుడూ చూడలేదని, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా, ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇబ్బందులను ముందుగానే గుర్తించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. విమర్శలకు తావివ్వకుండా కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. మినర్‌ వాటర్‌ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను తిరిగి నిర్వహణలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని ప్లాంట్లు కచ్చితంగా పని చేసేలా చూడాలని ఆదేశించారు. కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement